Naga Vamsi : టాలీవుడ్ లో ఉన్న టాప్ నిర్మాతలలో సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఒకరు. స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించే ఈ ప్రొడ్యూసర్ ఎప్పటికప్పుడు వివాదాలతో జనాల నోళ్ళలో నానుతూ ఉంటాడు. నాగ వంశీ నిర్మాతగా సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు… ప్రమోషన్లలో ఆయన హడావిడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సినిమాపై అదిరిపోయే రేంజ్ లో స్టేట్మెంట్లు ఇస్తూ హైప్ ని ఆకాశానికి ఎత్తేస్తారు. ఇలా చేయడం వల్ల ఎన్నోసార్లు ట్రోలింగ్ కు గురైనప్పటికీ, ఆయన ఏమాత్రం పట్టించుకోరు. అయితే తాజాగా నాగ వంశీలో మార్పు కనిపిస్తోంది. “మీ అందరి సపోర్ట్ కావాలి” అంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
తాజాగా నాగ వంశీ (Naga Vamsi) ఎక్స్ లో “ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమాను పెద్ద బ్లాక్ బస్టర్ ను చేయడానికి ప్రయత్నిద్దాం” అంటూ ట్వీట్ చేశారు. అయితే అసలు ఉన్నట్టుండి నాగవంశీలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో అంటూ ఆశ్చర్యపోతున్నారు జనాలు. కొంతమంది ట్విట్టర్ లో ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య వార్ ని చూసినట్టు ఉన్నావు అంటుంటే, మరికొంతమంది మాత్రం నిన్న మొన్నటిదాకా నిర్మాత బోని కపూర్ విషయంలో ఆయన చేసిన కామెంట్స్ పై వచ్చిన ట్రోలింగ్ కారణం అంటున్నారు. ఇక మరోవైపు రీసెంట్ గా సినిమా నుంచి రిలీజైన ‘దబిడి దిబిడి’ సాంగ్ పై ఓ రేంజ్ లో ట్రోల్స్ నడుస్తున్నాయి.
ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం.
అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద blockbuster success అవ్వటానికి ప్రయత్నిద్దాం.
మీ
Naga Vamsi— Naga Vamsi (@vamsi84) January 4, 2025
అసలు విషయం ఏంటంటే… ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాను అస్సలు పట్టించుకోవట్లేదు. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ మధ్య ఉన్న గొడవల వల్ల నెట్టింట బాలయ్య (Nandamuri Balakrishna) వర్సెస్ తారక్ (Jr NTR) అన్న విధంగా ఇద్దరు హీరోల అభిమానులు వార్ మొదలు పెట్టారు. ‘దేవర’ సినిమా టైంలో కూడా బాలయ్య రియాక్ట్ కాలేదు. కాబట్టి ఇప్పుడు ‘డాకు మహారాజ్’ని టార్గెట్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలోనే నాగ వంశీ తాజాగా అందరిని కూల్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఎప్పుడూ ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండే ఈ నిర్మాత ఎట్టకేలకు ఈ వార్ వల్ల తగ్గాల్సి వచ్చింది.
ఇదిలా ఉండగా నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. బాబి డియోల్, చాందిని చౌదరి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతోంది. అయితే ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘గేమ్ ఛేంజర్’ మూవీలు కూడా రిలీజ్ అవుతుండడంతో, ‘డాకు మహారాజ్’ ప్రమోషన్ల పరంగా వెనకబడిపోయినట్టుగా కనిపిస్తోంది. అది చాలదన్నట్టు ఇప్పుడు నెగిటివ్ ట్రెండ్ కూడా మొదలైంది.