ప్రతిరోజూ మలవిసర్జన చేయడం అత్యవసరం. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. పొట్టలో అంతా బాగానే ఉందని చెప్పడానికి ప్రతిరోజు ఒకసారి మలవిసర్జన చేయడం అనేది ఒక సూచన. అయితే కొంతమంది రోజుకు ఎక్కువసార్లు మలవిసర్జన చేస్తూ ఉంటారు. రోజుకు మూడుసార్లు మలవిసర్జన చేయడం సాధారణమా లేక ప్రమాదకరమైనదో వైద్యులు వివరిస్తున్నారు.
వైద్యులు చెబుతున్న ప్రకారం రోజుకు మూడుసార్లు మలవరసర్జన చేసినప్పుడు… ప్రతిరోజు అదే విధంగా చేస్తూ ఉంటే అది సాధారణ దినచర్యగానే భావించాలి. అయితే మలం సాధారణంగా ఏర్పడినంతవరకు పర్వాలేదు. అలా కాకుండా మలవిసర్జనకు వెళ్లే ముందు విపరీతమైన అసౌకర్యం, నొప్పి, నీళ్ళల్లాగా రావడం లేదా తీవ్రంగా గట్టిపడి మలం పడడం వంటివి మాత్రం ఆరోగ్యానికి మంచి సూచన కాదు. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది.
మలవిసర్జన సమస్యలు ఏవి రాకుండా ఉండాలంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మీ ఆహారాలలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు వంటి ఫైబర్ నిండిన పదార్థాలను తీసుకునేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మలవిసర్జన సవ్యంగా జరుగుతుంది. అలాగే పగటిపూట అధికంగా నీరు తాగాల్సిన అవసరం ఉంది. మరొక విషయం ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పెరుగు వంటివి ప్రతిరోజూ ఒక కప్పు తినాలి. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
నిరంతర శారీరక శ్రమ చేయడం కూడా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా కనీసం అరగంట పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేసేందుకు ప్రయత్నించండి. ఇది అన్ని రకాలుగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
అలాగే ప్రతిరోజు ఒకే సమయానికి బాత్రూం వెళ్లడం అన్నిటికన్నా ఉత్తమం. ఇది మీ శరీరానికి మలవిసర్జన సమయాన్ని శిక్షణ ఇవ్వడంతో సమానం. ఆరుబయట ఆహారాలు తినడం వల్ల మలబద్ధకం లేదా విరేచనాలు వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ శరీరానికి ఏవి సరిపడతాయో అలాంటి ఆహారాలను ఎంపిక చేసుకొని తినడం అన్నిటికన్నా ఉత్తమం.
ప్రతి మనిషి తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒత్తిడి, ఆందోళన వల్ల జీర్ణ వ్యవస్థ తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఒత్తిడి అధికమైతే జీర్ణ వ్యవస్థపై నెగిటివ్ ప్రభావం పడుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా వంటివి అలవాటు చేసుకోవాలి. మలవిసర్జన వచ్చిన వెంటనే చేయడం ఉత్తమం. ఆ పని వాయిదా వేయడం మంచి పద్ధతి కాదు. ఇది మలబద్ధకానికి కారణం అవుతుంది.
అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ మలవిసర్జన సమయంలో ఇబ్బందులు ఎదురవుతుంటే వైద్యులను కలిసి తగిన చికిత్సలు తీసుకోవాలి. దీనికి ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్, హైపో థైరాయిడిజం వంటి సమస్యలు కూడా కారణం అవ్వచ్చు. కాబట్టి వైద్యులు తగిన పరీక్షలు చేసి మీకున్న ఆరోగ్య సమస్యలను నిర్ధారిస్తారు.
మల విసర్జన సమయంలో తీవ్రంగా నొప్పి రావడం లేదా మలంలో రక్తం కనిపించడం, విపరీతంగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకండి. ఇవి అంతర్లీనంగా ఉన్న ప్రమాదకరమైన వ్యాధులను సూచిస్తాయి.