Katte pongali recipe: ఉదయం లేవగానే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేయాలనే.. ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. రొటీన్ టిఫిన్‌ల కంటే వేడి వేడిగా, కమ్మగా, నోట్లో వెన్నలా కరిగి పోయే ఒక ట్రెడిషనల్ బ్రేక్ ఫాస్ట్ ఉంటే ఆ రోజంతా హ్యాపీగా గడి చిపోతుంది. సౌత్ ఇండియన్ టేస్ట్‌కి ప్రతిరూపంగా నిలిచే ఒక అద్భుతమైన వంటకమే కట్టే పొంగలి. ఈ స్టైల్‌లో చేస్తే ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే! ఆ టేస్టీ రెసిపీ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
సౌండ్ ఇండియన్ వంటకాల్లో కట్టే పొంగలికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా ఆలయాల్లో ప్రసాదంగా పెట్టే ఈ పొంగలి రుచి ఎవరికైనా సరే వెంటనే నచ్చేస్తుంది. దీంట్లో వేసే మిరియాలు, జీలకర్ర, నెయ్యి , జీడిపప్పుల కాంబినేషన్ తింటుంటే వచ్చే అనుభూతే వేరు. సరైన కొలతలతో ఈ స్టైల్‌లో చేస్తే ఎవరైనా సరే దీన్ని ఇష్టపడతారు.
బియ్యం: 1 కప్పు
పెసరపప్పు (మూంగ్ దాల్): అర కప్పు
నెయ్యి: 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
మిరియాలు: 1 టీస్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
అల్లం తరుగు: 1 టీస్పూన్
జీడిపప్పు: గుప్పెడు
పచ్చిమిర్చి: 3
కరివేపాకు,ఇంగువ: కొద్దిగా
ఉప్పు: సరిపడా
1. ముందుగా ఒక కప్పు బియ్యం , అర కప్పు పెసరపప్పును శుభ్రంగా కడిగి, అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత కుక్కర్‌లో వేసి, 4 నుంచి 5 కప్పుల నీళ్లు పోసి, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఎప్పుడైనా పొంగలి కొంచెం జారుడుగా ఉంటేనే రుచిగా ఉంటుంది.
2.ఇప్పుడు ఒక కడాయిలో గుమ గుమలాడే స్వచ్ఛమైన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత అదే నెయ్యిలో జీల కర్ర, కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు, సన్నగా తరిగిన అల్లం తరుగు, పచ్చి మిర్చి చీలికలు, కరివెపాకు , చిటికెడు ఇంగువ వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి.
4. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పొంగలి మిశ్రమాన్ని ఈ తాలింపులో వేయాలి. మంటను సన్నగా ఉంచి గరిటెతో బాగా కలపాలి. పొంగలి మరీ గట్టిగా అనిపిస్తే.. కొద్దిగా వేడి నీళ్లు కలుపుకోవచ్చు. చివరగా వేయించి పెట్టుకున్న జీడి పప్పును అందులో కలపాలి.
5. దించే ముందు మరో స్పూన్ నెయ్యి పైనుంచి వేస్తే ఆ సువాసన ఇళ్ళంతా గుమ గుమ లాడి పోతుంది.
వేడి వేడి కట్టే పొంగలిని అల్లం పచ్చడి లేదా కొబ్బరి చట్నీతో పాటు సాంబార్‌తో సర్వ్ చేస్తే ఆ రుచి అమృతంలా ఉంటుంది. చలి కాలంలో లేదా వర్షా కాలంలో.. ఇలాంటి వేడి వేడి బ్రేక్ ఫాస్ట్ తింటే శరీరానికి ఎంతో శక్తి కూడా అందుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ఈ కట్టే పొంగలిని ట్రై చేసి అందరి చేత శభాష్ అనిపించుకోండి!