Smartphone neck pain| ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఈ రోజుల్లో ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. మెసేజ్‌లు చూడటం, వీడియోలు వీక్షించడం, సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం నిత్యజీవితంలో భాగమయ్యాయి. అయితే, ఫోన్ చూసేటప్పుడు చాలామంది గంటల తరబడి తల వంచి ఉంటారు. ఈ అలవాటు మెడ నొప్పికి కారణమవుతుందా? వెన్నెముకపై శాశ్వత ప్రభావం చూపుతుందా? నిపుణులు చెప్పే విషయాలు తెలుసుకుందాం.
ఎక్కువసేపు ఫోన్ వైపు తల వంచి చూడటం వల్ల మెడ, భుజాల కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమస్యను సాధారణంగా ‘టెక్స్ట్ నెక్’ అని పిలుస్తారు. అయితే, ఇది అధికారిక వైద్య నిర్ధారణ కాదు.
విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. మెడ కండరాలు ఎక్కువసేపు ఒకే స్థితిలో పనిచేయడం వల్ల అలసట, బిగుతు, తలనొప్పి, భుజాల నొప్పి రావచ్చు. తగినంత నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి, ఎక్కువసేపు కూర్చోవడం కూడా ఈ సమస్యను పెంచుతాయి.
ఫోన్ చూస్తూ తల వంచడం వల్ల వెన్నెముక శాశ్వతంగా దెబ్బతింటుందని భయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా మెడను ముందుకు వంచడం సహజమైన కదలికే. అయితే, గంటల తరబడి ఒకే భంగిమలో ఉండటం వల్ల కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే మెడ నొప్పి ఉన్నవారికి సమస్య మరింత ఎక్కువ కావచ్చు.
వయసు పెరిగేకొద్దీ వెన్నెముకలోని డిస్కులు, కీళ్లలో మార్పులు రావడం సాధారణం. కానీ ఇలాంటి మార్పులు ఉన్న ప్రతి ఒక్కరికీ నొప్పి ఉంటుందని చెప్పలేం. అందుకే ప్రతి మెడ నొప్పికి ఎక్స్‌రే లేదా ఎంఆర్ఐ అవసరం లేదు. వైద్యులు లక్షణాలను పరిశీలించిన తర్వాతే పరీక్షలను సూచిస్తారు.
1. ఫోన్ కళ్లకు సమాన స్థాయిలో ఉంచండి: తల వంచి చూడకుండా ఫోన్‌ను వీలైనంత వరకు కళ్లకు ఎదురుగా పట్టుకోండి.
2. మధ్యమధ్యలో విరామం తీసుకోండి: ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఫోన్ పక్కన పెట్టి కొద్దిసేపు నడవండి. భుజాలను కదిలించండి.
3. కండరాలను బలోపేతం చేసుకోండి: వాకింగ్, స్విమ్మింగ్, ఈత, సాధారణ వ్యాయామాలు మెడ, భుజాల కండరాలకు బలాన్ని అందిస్తాయి.
4. పని చేసే విధానాన్ని మార్చుకోండి: కంప్యూటర్ స్క్రీన్ సరైన ఎత్తులో ఉంచండి. సౌకర్యవంతమైన కుర్చీ ఉపయోగించండి.
5. నొప్పి నిర్లక్ష్యం చేయకండి: నొప్పి ఎక్కువకాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించండి. చేతుల వరకు నొప్పి వ్యాపించడం, తిమ్మిర్లు, బలహీనత ఉంటే ప్రత్యేక శ్రద్ధ అవసరం.
Also Read: భర్త కౌగిలించుకోగానే విరిగిన భార్య పక్కటెముకలు.. అతని తప్పులేదన్న డాక్టర్లు
చిన్ టక్స్, షోల్డర్ రోల్స్, షోల్డర్ బ్లేడ్ స్క్వీజెస్ వంటి సున్నితమైన కదలికలు ప్రయత్నించవచ్చు. మెడను మెల్లగా పక్కలకు వంచడం, నిలబడి చేతులను పైకి చాపడం కూడా ఉపయోగపడతాయి. నొప్పి, తిమ్మిర్లు లేదా అసౌకర్యం పెరిగితే వ్యాయామం ఆపాలి.
Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా? హాస్పిటల్ బిల్స్ ఈఎంఐలో చెల్లించవచ్చు.. ఎలాగంటే?
తీవ్రమైన గాయం తర్వాత మెడ నొప్పి వస్తే వైద్య పరీక్ష అవసరం. చేతులు బలహీనపడటం, నడవడంలో ఇబ్బంది, చేతుల కదలికల్లో సమన్వయం తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. జ్వరంతో పాటు తీవ్రమైన మెడ నొప్పి వచ్చినా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.