Bhagvadgita The Way To Moksha| మనిషి పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఏమిటి? మరణం తర్వాత ఆత్మ ఏమవుతుంది? జన్మ, మరణ చక్రం నుంచి విముక్తి పొందడం ఎలా? ఇలాంటి ప్రశ్నలకు శ్రీమద్భగవద్గీతలో సమాధానం ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశాలు జీవితానికి సరైన మార్గాన్ని చూపిస్తాయి. గీతలోని 14వ అధ్యాయంలో రెండు ముఖ్యమైన శ్లోకాల ద్వారా మోక్షం, సృష్టి రహస్యాలను వివరించారు. ఆ శ్లోకాల అర్థాలు, వాటిలోని జీవిత పాఠాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీకృష్ణుడు చెప్పిన మొదటి శ్లోకం:
ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః ।
సర్గేఽపి నోపజాయంతే ప్రలయే న వ్యథంతి చ ॥
అర్థం:
ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని వివరించారు. పరమ జ్ఞానాన్ని ఆశ్రయించి తన దివ్య స్వరూపాన్ని చూసినవారు మళ్లీ జన్మించరని చెప్పారు.
సృష్టి మళ్లీ ప్రారంభమైనా అలాంటి వారికి పునర్జన్మ ఉండదు. అలాగే మహాప్రళయం సంభవించినప్పుడు కూడా వారు ఎలాంటి బాధకు గురికారు. అంటే, దైవజ్ఞానాన్ని పొందిన సాధకులు జనన మరణాల చక్రం నుంచి విముక్తి పొందుతారు. ఈ స్థితినే మోక్షం అంటారు.
ఈ శ్లోకం మనకు ఎలాంటి జీవిత పాఠాన్ని నేర్పుతుంది?
మనిషి జీవితంలో సుఖదుఃఖాలు, లాభనష్టాలు సహజం. అయితే వాటికి అతిగా ప్రభావితం కాకుండా మనశ్శాంతిని కాపాడుకోవాలి. ఆత్మజ్ఞానం, భగవంతుడిపై విశ్వాసం మనిషికి ధైర్యాన్ని అందిస్తాయి. కష్టసమయాల్లో కూడా ప్రశాంతంగా ఉండే శక్తినిస్తాయి.
శ్రీకృష్ణుడు చెప్పిన రెండో శ్లోకం:
సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః।
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా ॥
శ్లోకం అర్థం:
ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు సృష్టి రహస్యాన్ని అర్జునుడికి వివరించారు. వివిధ జీవరాశుల్లో జన్మించే అన్ని జీవులకు ప్రకృతే తల్లి అని చెప్పారు. ప్రకృతి ప్రతి జీవికి భౌతిక శరీరాన్ని అందిస్తుంది. ప్రతి జీవిలో జీవరూపమైన బీజాన్ని అందించే పరమాత్ముడే అందరికీ తండ్రినని ఆ పరమాత్మను తానేనని శ్రీకృష్ణుడు వివరించారు. అంటే, ప్రకృతి శరీరానికి ఆధారమైతే, పరమాత్మ సృష్టికి దైవిక ఆధారం.
Also Read: పైకి తీపి మాటలు, లోపల కుట్రలు.. ఈ 7 లక్షణాలు ఉన్నవారితో జాగ్రత్త..
ప్రపంచంలోని జీవులందరికీ ఒకే దైవిక మూలం ఉందని ఈ శ్లోకం తెలియజేస్తుంది. అందుకే మనుషులు ఇతర జీవుల పట్ల ప్రేమ, దయ, కరుణ చూపించాలి. కులం, మతం, స్థాయి ఆధారంగా ఎవరినీ తక్కువగా చూడకూడదు. అహంకారం, ద్వేషం, అసూయను విడిచిపెట్టాలి.
Also Read: భగవద్గీత.. ఓటమి, బాధ, నిరాశ.. వీటిని అధిగమించడానికి శ్రీకృష్ణుడు చెప్పిన మార్గం
శ్రీకృష్ణుడి ఈ రెండు ఉపదేశాలు ఆత్మజ్ఞానం, మోక్షం, సృష్టి రహస్యాలను వివరిస్తాయి. మొదటి శ్లోకం దైవజ్ఞానం ద్వారా జన్మమరణ చక్రం నుంచి విముక్తి పొందే మార్గాన్ని తెలియజేస్తుంది. రెండో శ్లోకం ప్రకృతి, పరమాత్మ, జీవుల మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది.