Menthi kodi guddu kura: ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు.. లేదా రోజూ తినే రొటీన్ కూరలతో విసుగు చెందినప్పుడు టక్కున గుర్తొచ్చేది కోడిగుడ్డు. కేవలం ఐదు నిమిషాల్లో ఉడికించుకోవచ్చో లేదా ఆమ్లెట్ వేసుకోవచ్చో అనుకుంటారు. కానీ..గుడ్డుతో కొంచెం వెరైటీగా, హెల్దీగా ఏదైనా చేయాలనుకుంటే ‘మెంతి కోడిగుడ్డు కూర’ అద్భుతమైన ఛాయిస్. మెంతుల చేదు తెలియకుండా.. ఎగ్ టేస్ట్ కలిపి ఈ కూర తింటే అమృతంలా ఉంటుంది. ఈ ట్రెడిషనల్ కాంబినేషన్‌ను చాలా ఇష్టపడతారు. ఇంతకీ ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉడికించిన కోడిగుడ్లు – 4 లేదా 5
మెంతి ఆకులు – 1 కప్పు
ఉల్లిపాయలు – 2
టమాటాలు – 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
పచ్చిమిర్చి – 3
కారం – 1.5 స్పూన్లు
పసుపు – చిటికెడు
ధనియాల పొడి – 1 స్పూన్
గరం మసాలా – అర స్పూన్
నూనె – 3 స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర – కొద్దిగా
1.ముందుగా.. ఉడికించిన గుడ్లకు చిన్నగా గాట్లు పెట్టి, పాన్ లో కొద్దిగా నూనె, పసుపు, కారం వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మరికొద్దిగా నూనె వేసి తరిగిన పచ్చిమిర్చి, ఉల్లి పాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగాక తరిగిన మెంతి ఆకులను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. మెంతి ఆకులు నూనెలో మగ్గడం వల్ల వాటిలో ఉండే చేదు పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా కలిపి, టమాటో గుజ్జును వేయాలి. తర్వాత దానికి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
2. ఈ మిశ్రమంలో కారం, పసుపు, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. గ్రేవీకి సరి పడా కొద్దిగా నీరు పోసి మరగనివ్వాలి. గ్రేవీ చక్కగా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న.. కోడి గుడ్లను వేసి, సన్నని మంటపై 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా.. గరం మసాలా, కొత్తి మీర చల్లుకొని దించేస్తే గుమగుమలాడే మెంతి కోడి గుడ్డు కూర రెడీ!
Also Read: వేడి వేడి అన్నంలోకి అమృతంలా ఉండే..కంది పచ్చడి
మెంతికూరలో ఐరన్, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచడంలో.. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఎంత గానో సహాయ పడుతుంది. అలాగే గుడ్డులోని ప్రోటీన్లు శరీరానికి శక్తినిస్తాయి. ఇంట్లో ఉన్న అతి తక్కువ పదార్థాలతోనే ఈ ఆరోగ్యకరమైన కూరను ఈజీగా తయారు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంతో లేదా చపాతీతో ఇది అద్భుతమైన కాంబినేషన్.
మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ ఇంట్లో ఈ కమ్మని మెంతి కోడిగుడ్డు కూరను ట్రై చేయండి. మీ కుటుంబ సభ్యులతో కలిసి రుచిగా భోజనాన్ని ఆస్వాదించండి!