Beerakaya roti pachadi: ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా రోజూ.. తినే రకం కూరలతో.. బోర్ కొట్టినప్పుడు, నోటికి రుచిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటి సమయంలో.. టేస్టీగా, ఆరోగ్యకరంగా ఉండే ‘బీర కాయ రోటి పచ్చడి’అద్భుతమైన ఆప్షన్. మిక్సీలో.. చేసిన దాని కంటే, రోట్లో లేదా కచ్చా పచ్చాగా దంచిన పచ్చడి రుచి అమృతంలా ఉంటుంది. అందుకే ..చాలా మంది ఫుడ్ లవర్స్ మళ్లీ ట్రెడిషనల్ వంటకాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరి ఈ కమ్మని పచ్చడిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
బీరకాయ ముక్కలు – 2 కప్పులు
పచ్చిమిర్చి – 6 నుండి 8 (కారానికి తగినట్లుగా)
టమాటాలు – 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
చింతపల్లి – చిన్న నిమ్మకాయ సైజు
వెల్లుల్లి రెబ్బలు – 6 నుంచి 8
జీలకర్ర – 1 స్పూన్
పచ్చి శనగపప్పు, మినపప్పు -1 స్పూన్ చొప్పున
నూనె – 2 స్పూన్లు
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
1.ముందుగా బీరకాయలను.. శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరగాలి. తర్వాత ప్యాన్‌లో కొద్దిగా.. నూనె వేసి, పచ్చి మిర్చి, బీరకాయ ముక్కలను వేసి మెత్తగా మగ్గే వరకు వేయించాలి. బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత, తరిగిన టమాటా ముక్కలు, చింత పండు వేసి టమాటాలు గుజ్జులా అయ్యేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత..అదే పాన్ లో.. కొద్దిగా నూనె వేసి జీల కర్ర, వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. వీటన్నింటిని చల్లారిన తర్వాత రోట్లో వేసి, తగినంత ఉప్పు, కొత్తి మీర వేసి కచ్చా పచ్చాగా దంచాలి. రోలు అందుబాటులో లేకపోతే మిక్సీ జార్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా కొద్దిగా నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పచ్చడికి తాలింపు పెట్టుకుంటే .. ఘుమఘుమలాడే బీరకాయ రోటి పచ్చడి రెడీ!
బీరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరచడమే కాకుండా శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి.. ఇది చక్కటి ఆహారం. ఇక ఈ పచ్చడిలో వాడే వెల్లుల్లి, జీలకర్ర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయ పడతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వారాంతంలో.. మీ ఇంట్లో వేడివేడి అన్నంతో ఈ రుచికరమైన బీరకాయ రోటి పచ్చడిని ట్రై చేయండి. కుటుంబ సభ్యులందరితో.. కలిసి కమ్మని భోజనాన్ని ఆస్వాదించండి!