Sore Throat Monsoon| వర్షాకాలంలో చల్లని వాతావరణం ఆహ్లాదాన్ని కలిగించినా, గొంతు ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం కూడా పెరుగుతుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల వైరస్‌లు, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరచవచ్చు. అందువల్ల ఈ కాలంలో గొంతు ఇన్‌ఫెక్షన్లు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం.
గొంతు నొప్పి రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఈ సీజన్‌లో ఇన్‌ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తాయి. రెండవది ఉష్ణోగ్రత చల్లగా ఉన్నప్పుడు ఐస్ వాటర్ లేదా ఫ్రిజ్ నీళ్లు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వంటివి తాగడం. ఈ కారణాలతోనే గొంతు నొప్పి వస్తుంది. సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ నొప్పి కొన్ని రోజులకు క్రమంగా తగ్గిపోతుంది. కానీ వెంటనే ఉపశమనం కోసం మార్కెట్లో కొన్ని టాబ్లెట్స్ ఉన్నా.. వాటి కంటే సహజంగా ఇంట్లో అల్లం, బెల్లం ఉపయోగించి ఒక డ్రింక్ తయారు చేసి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
పచ్చి అల్లంలో 6 జింజరాల్ అనే సహజ కాంపౌండ్ ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి గొంతులో మంటను తగ్గించడంలో, రోగనిరోధక శక్తికి మద్దతు ఇవ్వడంలో సహాయపడవచ్చు. అల్లంలో ఉండే బయోయాక్టివ్ పదార్థాలు శరీరం సులభంగా గ్రహిస్తుంది. అయితే అల్లం ఒక్కటే గొంతు ఇన్‌ఫెక్షన్లను పూర్తిగా నివారించదు.
బెల్లాన్ని చాలా కాలంగా సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి స్వల్ప గొంతు చికాకును తగ్గించడంలో సహాయపడవచ్చు. గోరువెచ్చని బెల్లం డ్రింక్ గొంతుకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే బెల్లంలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటంతో పరిమితంగా తీసుకోవాలి.
అల్లం, బెల్లంతో తయారుచేసిన డ్రింక్ శరీరానికి కొంత మద్దతు ఇస్తుంది. ఇది గొంతు నొప్పి, చికాకును తగ్గించడంలో ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా సహాయపడవచ్చు. అయితే ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు దీన్ని సహాయక డ్రింక్‌గా మాత్రమే ఉపయోగించాలి.
తాజా అల్లం ముక్కలను నీటిలో కొన్ని నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తురిమిన బెల్లం కలపాలి. బెల్లం పూర్తిగా కరిగే వరకు బాగా కలపాలి. ఈ డ్రింక్‌ని పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది.
అల్లం – బెల్లం పానీయం గొంతు గరుకుదనాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. స్వల్ప గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. శరీరానికి వెచ్చదనంతో పాటు తగినంత ద్రవాలను అందిస్తుంది. రోగనిరోధక శక్తిని కొంతవరకు పెంచుకుంది.
ఈ పానీయం అందరికీ ఒకే విధంగా సరిపోదు. మధుమేహం ఉన్నవారు బెల్లం పరిమితంగా తీసుకోవాలి. యాసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రిటిస్ సమస్యలు ఉన్నవారికి అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. రక్తం పలుచబడే మందులు తీసుకునేవారు అల్లం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి. రోజంతా తగినంత నీరు తాగాలి. సరిపడా నిద్రపోవాలి. ఇతరులతో మీరు తాగేందుకు, తినేందుకు ఉపయోగించే గ్లాస్‌లు, ప్లేట్లు పంచుకోవడం తగ్గించాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను ఎప్పుడూ పాటించాలి.
Also Read : టాలెంట్ అంటే ఇదీ.. తనకు అడ్మిషన్ ఇవ్వలేదని ఐఐటి మద్రాస్ వెబ్‌సైట్ హ్యాక్ చేసిన విద్యార్థి
గొంత నొప్పి, జ్వరం మూడు రోజులకంటే ఎక్కువగా కొనసాగితే వెంటనే వైద్యుడిని కలవాలి. మింగడానికి ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. కఫంలో రక్తం కనిపించినా లేదా తరచూ గొంతు ఇన్‌ఫెక్షన్లు వస్తున్నా తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
అల్లం – బెల్లం పానీయం వర్షాకాలంలో గొంతుకు ఉపశమనాన్ని ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తికి కొంత మద్దతు ఇవ్వవచ్చు. అయితే ఇది కేవలం సహాయక గృహచికిత్స మాత్రమే. ఆరోగ్యకరమైన ఆహారం, పరిశుభ్రత, అవసరమైనప్పుడు వైద్య చికిత్సతో కలిపి పాటిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తొలిసారి తీసుకుంటున్నారా? ముందు ఈ 4 విషయాలు తప్పక చెక్ చేయండి