Chinthapandu roti pachadi:ఈ రోజుల్లో మిక్సీలు, గ్రైండర్లు అందుబాటులోకి వచ్చాక రోట్లో నూరి వండే వంటకాల టేస్ట్ దాదాపు కనుమరుగైపోతున్నాయి. కానీ మిక్సీలో చేసిన పచ్చడికి, రోట్లో చేత్తో నూరిన పచ్చడికి ఉన్న రుచిలో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. మన అమ్మమ్మలు, నాయనమ్మలు అప్పట్లో చేసే పచ్చళ్ల వాసన ఇల్లంతా గుమగుమలాడేది. ముఖ్యంగా శనివారాలు లేదా ప్రత్యేక రోజుల్లో అమ్మమ్మ చేసే చింతపండు రోటి పచ్చడి ముందు ఎంత పెద్ద హోటల్ భోజనమైనా దిగదుడుపే. మరి ఆ అరుదైన,నోరూరించే అమ్మమ్మ స్టైల్ చింతపండు పచ్చడిని మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం!
కావాల్సిన పదార్థాలు:
గుజ్జు తీసుకున్న చింతపండు: నిమ్మకాయ సైజు అంత
ఎండుమిర్చి: 10 నుండి 12
పచ్చిమిర్చి: 4 లేదా 5
జీలకర్ర: 1 స్పూన్
మెంతులు: అర స్పూన్
వెల్లుల్లి రెబ్బలు: 10 నుంచి 12
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2 స్పూన్లు
తాలింపు గింజలు (ఆవాలు, శనగపప్పు, మినపప్పు), కరివేపాకు, ఎండుమిర్చి (పోపు కోసం)
తయారీ విధానం :
1. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మెంతులు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత అందులోనే.. ఎండుమిర్చి, పచ్చి మిర్చి వేసి మంచి సువాసన వచ్చే వరకు, మిర్చి కలర్ మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. చింతపండును కొద్దిగా గోరువెచ్చని నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి.
2.ఇప్పుడు అసలైన మ్యాజిక్ మొదలవుతుంది! ఒక శుభ్ర మైన రోలు తీసుకుని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, మెంతులు వేయాలి. తగినంత ఉప్పు వేసి రోకలి బండతో మెత్తగా దంచాలి. మిర్చి కాస్త నలిగిన తర్వాత అందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరో సారి కచ్చా పచ్చాగా దంచాలి. వెల్లుల్లి తగిలే తీరు ఈ పచ్చడికి అద్భుతమైన టేస్ట్ ఇస్తుంది.
3. ఇప్పుడు ముందుగా నాన బెట్టుకున్న చింత పండు గుజ్జును (నీళ్లు లేకుండా పిండుకుని)రోట్లో వేయాలి. అలాగే.. చిటికెడు పసుపు కూడా కలపాలి. చింతపండు, మిర్చి అన్నీ బాగా కలిసి పోయేలా రోకలితో చక్కగా నూరాలి. చింతపండు పూర్తిగా మెత్తబడి, పచ్చడి రూపంలోకి.. వచ్చే వరకు బాగా దంచాలి. ఈ ప్రాసెస్‌లో వచ్చే వాసనే మనకు నోట్లో నీళ్లు ఊరిస్తుంది.
4. పచ్చడిని రోటి నుంచి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత, చివరిగా పోపు పెట్టుకుంటే రుచి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. చిన్న కడాయిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి చిటపటలాడించాలి. ఈ పోపును ముందుగా తయారు చేసి పెట్టుకున్న.. చింతపండు పచ్చడిలో కలిపి బాగా కలపాలి.
అంతే! గుమగుమలాడే.. అచ్చమైన అమ్మమ్మ స్టైల్ చింత పండు రోటి పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని, పై నుంచి నెయ్యి వేసుకొని.. తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. ఇది ఒక్క రోజు నిల్వ ఉన్నా కూడా చెడిపోదు, రుచి మరింత పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్ లో మీ ఇంట్లోనూ ఈ ట్రెండీ అండ్ ట్రెడిషనల్ పచ్చడిని ట్రై చేసి టేస్ట్ చేయండి.