మండే ఎండల్లో చల్లని నీటితో స్నానం చేస్తే ఉపశమనంగా అనిపిస్తుంది. ఉత్సాహంగా శరీరానికి ప్రాణం లేచి వచ్చినట్టు అనుభూతి కలుగుతుంది. చల్లటి జల్లులు చర్మంపై దురదలను తగ్గించి శాంత పరుస్తాయి. అలాగే ఎండార్పిన్లను విడుదల చేస్తాయి. దీనివల్ల చల్లటి నీళ్లతో స్నానం చేశాక ఉత్సాహంగా అనిపిస్తుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం చల్లని నీటి స్నానానికి దూరంగా ఉండాలి.
మధుమేహం ఉంటే…
వేసవికాలం అయినా కూడా చల్లని నీటితో స్నానం చేయడం కొంతమందికి శ్రేయస్కరం కాదు. అందులో ముఖ్యమైన వారు మధుమేహంతో బాధపడుతున్న వారు, అలాగే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు… మీరు ప్రతిరోజు చల్లని నీటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా చల్లని నీటి స్నానానికి దూరంగా ఉండటం ఉత్తమం.
గుండె సమస్యలు ఉన్నా కూడా
గుండె సంబంధిత వ్యాధులతో పోరాడుతున్న వ్యక్తులు చల్లని నీటితో స్నానం చేయకూడదు. ఎందుకంటే చల్లటి జల్లులు శరీరం పై పడినప్పుడు రక్తనాళాలు కుచించుకుపోతాయి. దీనివల్ల రక్త ప్రవాహం సరిగా జరగదు. ఇది రక్తపోటు పెరగడానికి, అలాగే హృదయ స్పందన రేటును పెంచడానికి కారణమవుతుంది. కరోనరీ ఆర్టరీ వ్యాధి బారిన పడిన వారికి ఈ చల్లని నీటి స్నానం ఆ సమస్యలను మరింత తీవ్రంగా మార్చేస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచేస్తుంది. అందుకే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు చల్లటి నీటిని శరీరంపై పోసుకోకూడదు.
హైబీపీ ఉన్నవారు
హైబీపీతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ప్రస్తుతం అధికంగానే ఉంది. అధిక రక్తపోటుకు.. హృదయ సంబంధ వ్యాధులకు దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి అది రక్తపోటుతో బాధపడుతున్న వారు కూడా చల్లని నీటిని శరీరంపై పోసుకోకూడదు. చల్లని నీరు చర్మంపై పడగానే షాక్ తగిలినట్టు అవుతుంది. ఇది రక్తపోటు పెరుగుదలకు కారణం అవుతుంది. అప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి మరింత రక్తపోటు పెరగడం అనేది స్ట్రోక్, గుండెపోటు సమస్యలకు కారణం అవుతుంది.
స్ట్రోక్ లేదా సెరెబ్రో వాస్కులర్ వ్యాధుల చరిత్ర ఉన్నవారు కూడా చల్లని నీటితో స్నానం చేయకూడదు. చల్లని నీరు శరీరంపై పడినప్పుడు రక్తపోటులో పదునైన పెరుగుదల కనిపిస్తుంది. ఇది స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది. స్ట్రోక్ నుండి బయట పడినవారు చల్లని నీటిని కాకుండా, అలా అని వేడి నీటిని కాకుండా… మధ్యస్థంగా ఉన్న గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఎంతో మంచిది.
రేనాడ్స్ అనే వ్యాధితో బాధపడుతున్న వారు కూడా చల్లని నీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ వ్యాధితో బాధపడుతున్న వారి శరీరానికి చల్లని నీరు తగిలినప్పుడు ప్రతిస్పందనగా వారి చేతివేళ్లు, కాలి వేళ్ళు అంత్య భాగాలలో రక్తనాళాలు విపరీతంగా కుచించుకుపోతాయి. రేనాడ్స్ ఉన్నవారికి తీవ్రమైన నొప్పి, తిమ్మిరి, తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. ఇది వారి ఆరోగ్య పరిస్థితిని మరింతగా దిగజారుస్తుంది. కాబట్టి రేనాడ్స్ అనే వ్యాధితో బాధపడుతున్న వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం. అన్ని కాలాల్లో కూడా వారు ఇదే నీటితో స్నానం చేయాలి.
ముసలివారు
వృద్ధులు కూడా చల్లని నీటితో స్నానం చేయడం ఏమాత్రం మంచిది కాదు. వీరికి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. వృద్ధులు సాధారణంగా హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా అల్ప ఉష్ణోగ్రతల వద్ద ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల వారికి షాక్ కొట్టినట్టు అవుతుంది. ఇది గుండె సమస్యలకు కారణం అవుతుంది. అలాగే తల తిరిగి పడిపోయే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి వృద్ధులు చల్లని నీటి స్నానాలకు దూరంగా ఉండడం ఉత్తమం.