ఆధునిక కాలంలో వివాహమైన రెండు మూడు రోజులకే హనీమూన్‌కు వెళ్తున్న జంటల సంఖ్య అధికంగా ఉంది. వివాహ తేదీ నిర్ణయించే ముందే హనీమూన్ కోసం కూడా పూర్తి ప్రణాళిక వేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లాలో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే భారతీయ సంప్రదాయం ప్రకారం ఇలా హనీమూన్‌కు పెళ్లి అయిన వెంటనే వెళ్లడం ఏమాత్రం మంచిది కాదు.
హిందూమత విశ్వాసాల ప్రకారం వివాహం తర్వాత జంట కనీసం 45 రోజులు పాటు ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు వెళ్ళకూడదు. దీనికి లోతైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.
పెళ్లయిన 45 రోజుల తరువాత
మన మత గ్రంథాలు చెబుతున్న ప్రకారం వివాహం తర్వాత 45 రోజుల కాలం ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా వధువుకు కొత్త ఇల్లు, కొత్త వాతావరణం, కొత్త సంబంధాలకు అనుగుణంగా శారీరకంగా, మానసికంగా, భావోద్వేగ పరంగా ఈ కాలం ప్రధానమైనది. ఆమె తనను తాను ఈ వాతావరణానికి సిద్ధం చేసుకోవాలి. శాస్త్రాలలో ఈ సమయాన్ని ఋతు శుద్ధి, గృహస్థ వ్రతం అని పిలుస్తారు. ఆధునిక భాషలో చెప్పుకోవాలంటే దీన్ని వివాహానంతరం శారీరక, భావోద్వేగ సర్దుబాటు అని పిలుచుకోవచ్చు.
ఈ సమయంలో వధువులో హార్మోన్ల సమతుల్యత, మానసిక స్థిరత్వం అనేవి గందరగోళంగా ఉంటాయి. ఇవి సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని వధువు తీసుకోవాలి. అలాగే వరుడు కూడా వధువుకు ఆ సమయాన్ని ఇవ్వాలి. అందుకే పెళ్లయిన తర్వాత 45 రోజులు వరకు వారు ఏ కొత్త ప్రాంతానికి హనీమూన్ పేరిట వెళ్లకపోవడమే ఉత్తమం.
వధువు కోసమే ఈ సమయం
హిందూ మత గ్రంథాలు చెబుతున్న ప్రకారం వివాహం అయిన వెంటనే వధువు చాలా సంయమనంతో ఉండాలని స్వచ్ఛంగా ప్రవర్తించాలని తెలుస్తోంది. దీనివల్ల కొత్త జీవితంలో సమతుల్యత ఏర్పడుతుందని గ్రంథాలు చెబుతున్నాయి. ఈ కాలంలో మనసు, శరీరం, సంబంధాలు… ఇలా అన్ని కొత్త బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధమవుతూ ఉంటాయి.
45 రోజులు ఎందుకు?
శాస్త్రాలు చెబుతున్న ప్రకారం పెళ్లైన మొదటి ఏడు రోజుల కాలంలో వధువు శరీరానికి, మనసుకు పూర్తి విశ్రాంతి కావాలి. అప్పుడే ఆమె మానసికంగా స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత ఎనిమిది నుండి 21 రోజులపాటు ఆమెకు భావోద్వేగ సర్దుబాటు, గృహ జీవితంలోని కొత్త బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఇక 22 నుండి 45 రోజుల వరకు ఆమె శరీరంలోని శక్తులను సమతుల్యం చేయడానికి సమయం కావాలి. కొత్త సంబంధాల్లోనూ ఆమె లోతుగా బంధాన్ని ఏర్పరచుకోవాలి.
అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆమె గ్రహస్థానాల ప్రభావాలు కూడా ఈ సమయంలో సర్దుబాటు అవుతాయి. కాబట్టి పెళ్లయిన తర్వాత 45 రోజుల వరకు కొత్త వధువు, వరుడు కలిసి ఇంట్లోనే ఉండడం ఉత్తమం. ఆ తర్వాతే హనీమూన్ కు ప్లాన్ చేయాలి. అప్పుడే వధువు కూడా సంతోషంగా జీవించగలుగుతుంది. ఇద్దరి మధ్య గొడవలు కూడా రాకుండా ఉంటాయి. అంతే తప్ప పెళ్లయిన రెండు మూడు రోజులకే హనీమూన్ పేరిట కొత్త ప్రాంతాలు రాష్ట్రాలు, దేశాలు తిరగడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు.