చిన్నపిల్లలకు బంగాళదుంపతో చేసే వంటకాలు నచ్చుతాయి. ముఖ్యంగా బంగాళదుంప వేపుడుని అధికంగా ఇష్టపడతారు. సాంబారు, పప్పు వండుకున్నప్పుడు పక్కన సైడ్ డిష్ గా బంగాళదుంప ఫ్రై ఉంటే ఆ కాంబినేషన్ అదిరిపోతుంది. ఇక్కడ మేము మసాలా బంగాళదుంప రెసిపీ ఇచ్చాము. ఇది కూడా వేపుడు లాంటిదే. పొడిపొడిగా వచ్చే మసాలా బంగాళదుంపను తింటే అద్భుతంగా ఉంటుంది. దీన్ని అన్నంలో కలుపుకున్న బాగుంటుంది. లేదా సాంబార్ తో పాటు సైడ్ డిష్ గా పెట్టుకొని తిన్నా టేస్టీగా ఉంటుంది. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
మసాలా బంగాళదుంప రెసిపీకి కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు – నాలుగు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – రెండు స్పూన్లు
ఇంగువ – చిటికెడు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
గరం మసాలా – అర స్పూను
జీలకర్ర – ఒక స్పూను
కారం – అర స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
పసుపు – పావు స్పూను
పచ్చిమిర్చి – రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూను
టమోటో – ఒకటి
ఉల్లిపాయ – ఒకటి
మసాలా బంగాళదుంప రెసిపీ
1. బంగాళదుంపలను ముందుగానే 70 శాతం ఉడికించుకొని పొట్టు తీసి మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. మరీ మెత్తగా ఉడికిస్తే కూర ముద్దగా అయ్యే అవకాశం ఉంది. పొడిపొడిగా ముక్కలు రావు. కాబట్టి సగం సగమే ఉడికించడం ఉత్తమం.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కాక జీలకర్రను ఇంగువను వేసి వేయించాలి.
4. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లి తరుగును వేసి అవి రంగు మారేవరకు వేయించుకోవాలి.
5. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.
6. ఇప్పుడు టమోటోలను వేసి బాగా కలిపి పైన మూత పెట్టాలి.
7. ఈ టమోటోలు మెత్తగా ఇగురులాగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
8. ఇప్పుడు పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి.
9. ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళదుంపలు ముక్కలను వేసి బాగా కలపాలి.
10. ఒక రెండు నిమిషాల తర్వాత గరం మసాలా పొడి కూడా వేసి బాగా కలపాలి. చిన్న మంట మీద దీన్ని ఉడికించాలి.
11. లేకపోతే బంగాళదుంపలు మాడిపోయే అవకాశం ఉంటుంది.
12. ఇప్పుడు స్టవ్ కట్టేయడానికి రెండు నిమిషాల ముందు కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
13. అంతే రుచికరమైన మసాలా బంగాళదుంప రెడీ అయినట్టే. దీని తిన్నారంటే మర్చిపోలేరు. సాధారణ బంగాళదుంప ఫ్రై కన్నా ఇది అద్భుతంగా ఉంటుంది.