వివాహమైన భార్యాభర్తలకు లైంగిక జీవితం ఎంతో ముఖ్యం. ఇది వారి అనుబంధంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే నెలవారీ వచ్చే పీరియడ్స్ విషయంలో మాత్రం మహిళల్లో ఒక అపోహ ఉంది. పీరియడ్స్ సమయంలో లైంగిక ప్రక్రియకు దూరంగా ఉండాలని భావిస్తారు. ఆ సమయంలో లైంగికంగా భర్తతో కలిస్తే ఎన్నో రకాల సమస్యలు వస్తాయని అనుకుంటారు. దీనికి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.
పీరియడ్స్ లో ఏం జరుగుతుంది?
పీరియడ్స్ అనేది ప్రతినెలా మహిళల్లో జరిగే సహజమైన ప్రక్రియ. ఇది గర్భాశయ లైనింగ్‌ను బయటికి పంపిస్తుంది. దీన్నే ఎండోమెట్రీయం అంటారు. ఈ ఎండోమెట్రియం లైనింగు విచ్ఛిన్నమై చిన్న చిన్న పొరల రూపంలో బయటికి పోతుంది. ఆ సమయంలో కొంతమంది మహిళలకు కడుపునొప్పి, నడుము నొప్పి, అసౌకర్యం, మానసిక స్థితిలో మార్పులు వంటివి కనిపిస్తాయి. అందుకే ఎంతోమంది మహిళలు ఆ సమయంలో లైంగిక ప్రక్రియకు దూరంగా ఉంటారు.
నిజానికి పీరియడ్స్ సమయంలో లైంగికంగా కలవకూడదని ఏ ఆరోగ్య నిపుణులు చెప్పడం లేదు. ఆ సమయంలో కూడా ఎలాంటి అసౌకర్యం లేకపోతే లైంగికంగా కలవడం అనేది సురక్షితమే. అనేక అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఋతుస్రావ్రం అనేది లైంగిక సంపర్కంలో ఎటువంటి సమస్యను కలిగించదు. అయితే అధిక రక్తస్రావం అవుతున్నప్పుడు లేదా తీవ్రంగా పొట్టనొప్పి ఉన్నప్పుడు మాత్రం లైంగిక ప్రక్రియకు దూరంగా ఉండడం మంచిది. లేకుంటే స్త్రీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది.
నిజానికి పీరియడ్స్ సమయంలో లైంగికంగా కలవడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
రుతుక్రమ సమయంలో లైంగిక ప్రక్రియ వల్ల స్త్రీ శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి పీరియడ్స్ సమయంలో వచ్చే పొట్ట నొప్పిని చాలా వరకు తగ్గిస్తాయి. అలాగే యోని పొడి భారే సమస్య కూడా తొలగిపోతుంది. యోని లూబ్రికేషన్ పెరుగుతుంది. పీరియడ్స్ సమయంలో మహిళలు మానసికంగా బలహీనంగా ఉంటారు. ఈ సమయంలో శారీరక అనుబంధాన్ని కలిగి ఉండడం వల్ల వారి మధ్య భావోద్వేగ బంధం కూడా బలపడుతుంది. లవ్ హార్మోన్ అని పిలిచే ఆక్సిటోసిన్ శరీరంలో విడుదలవుతుంది. ఇది వారి మధ్య భావోద్వేగ అనుబంధాన్ని పెంచుతుంది.
పీరియడ్స్ సమయంలో లైంగిక ప్రక్రియలో పాల్గొనడం వల్ల కలిగే నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి. రుతుక్రమ సమయంలో సెక్స్ చేస్తే లైంగిక ఇన్ఫెక్షన్లు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీ యోనిలో పీహెచ్ స్థాయి మారిపోతుంది. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి, కడుపు తిమ్మిరి, అసౌకర్యం వంటివి ఉంటాయి. అవి కూడా ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక రుతుక్రమం సమయంలో సెక్స్ చేయడం వల్ల అవాంఛిత గర్భం కూడా దాల్చే ప్రమాదం ఉంది.
పీరియడ్ సమయంలో లైంగికంగా కలవాలా? వద్దా? అనే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనది. మీరు మీ భాగస్వామికి ఇష్టపడితే మీకు ఎలాంటి ఇబ్బంది అనిపించకపోతే ఆ ప్రక్రియ పూర్తిగా సురక్షితమే. అయితే వైద్యులు చెబుతున్న ప్రకారం పీరియడ్స్ సమయంలోనే ఇన్ఫెక్షన్ ఒకరి నుండి ఒకరికి సులభంగా వ్యాపిస్తుంది. కాబట్టి పరిశుభ్రత విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.