Mumbai Style Vada Pav: ముంబై వీధుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన, రుచికరమైన స్నాక్స్‌లో వడా పావ్ ఒకటి. దీనిని ‘ఇండియన్ బర్గర్’ అని కూడా అంటారు. కారంగా, సువాసనతో ఉండే ఆలూ వడను, మెత్తటి పావ్ (బన్) మధ్యలో పెట్టి, ప్రత్యేకమైన చట్నీలతో కలిపి తింటే ఆ రుచే వేరు. ఈ రుచి కరమైన వడా పావ్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
1. వడ కోసం :
ఉడకబెట్టిన, మెత్తగా చేసిన ఆలుగడ్డలు : 3-4
శనగపిండి: 1 కప్పు
బియ్యం పిండి : 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి: 3-4
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
ఆవాలు: 1/2 టీస్పూన్
పసుపు పొడి: 1/2 టీస్పూన్
కరివేపాకు: కొన్ని రెబ్బలు
ఇంగువ: చిటికెడు
కొత్తిమీర తరుగు: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
వంట సోడా: చిటికెడు
నూనె: వేయించడానికి, పోపు కోసం
2. చట్నీ, పావ్ కోసం:
పావ్ బన్ : 4
ఎండు కొబ్బరి వెల్లుల్లి కారం పొడి : 2-3 టీస్పూన్లు
పచ్చిమిర్చి చట్నీ : 1-2 టీస్పూన్లు
వేయించిన పచ్చిమిర్చి: 4-5
తయారీ విధానం:
1. ఆలూ మసాలా/కూర తయారీ:
ముందుగా ఉడకబెట్టిన ఆలు గడ్డలను మెత్తగా చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి.. ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. ఇంగువ, కరివేపాకు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. పసుపు పొడి వేసి కలపండి. తరువాత మెత్తగా చేసిన ఆలు గడ్డలు, సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి.. సుమారు 1-2 నిమిషాలు ఉడికించండి. ఈ మసాలాను చల్లార్చి, చిన్న చిన్న ఉండలుగా (వడలుగా) తయారు చేసి పెట్టుకోండి.
2. వడ బ్యాటర్ తయారీ:
ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, చిటికెడు వంట సోడా, సరిపడా ఉప్పు, పసుపు పొడి వేసి కలపండి. కొద్దికొద్దిగా నీరు పోస్తూ.. ఉండలు లేకుండా కొంచెం గట్టిగా, మృదువైన బ్యాటర్‌ను తయారు చేయండి.
3. వడలు వేయించడం:
వేయించడానికి సరిపడా నూనెను వేడి చేయండి. తయారు చేసుకున్న ఆలూ ఉండలను శనగ పిండి బ్యాటర్‌లో ముంచి, నూనెలో వేసి, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు, క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి. అదే నూనెలో కొన్ని పచ్చిమిర్చిలను కూడా వేయించి పక్కన పెట్టుకోండి.
Also Read: ఆరోగ్యంగా ఉండాలా ? అయితే.. ఈ పిండితో చేసిన వంటకాలు తినడం మానేయండి
4. వడా పావ్ అసెంబ్లీ:
పావ్ బన్ ను మధ్యలో పూర్తిగా కట్ చేయకుండా సగం వరకు కట్ చేయండి. కట్ చేసిన లోపలి భాగంలో కొద్దిగా పచ్చిమిర్చి చట్నీ, వెల్లుల్లి కారం పొడిని రాయండి.
తయారు చేసిన వేడి వడను పావ్ మధ్యలో పెట్టి, మెల్లిగా నొక్కండి.
ముంబై స్టైల్ వడా పావ్ తినడానికి సిద్ధం! వేయించిన పచ్చిమిర్చి, అదనపు వెల్లుల్లి కారం పొడితో వేడి వేడి గా వడ్డించండి. ముంబై వడా పావ్ అంటే కేవలం స్నాక్ మాత్రమే కాదు. అది ఒక అనుభూతి.