Drugs Case: సాధారణంగా రోగులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన వైద్యుడే.. మత్తు పదార్ధాలకు బానిసగా మారడం నగరంలో కలకలం రేపుతోంది. ముషీరాబాద్ ప్రాంతంలో అద్దెకు తీసుకున్న ఇంట్లో డ్రగ్స్ నిల్వచేసి.. అమ్మకాలు నిర్వహిస్తున్న డాక్టర్‌ను ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ బీ టీమ్ పట్టుకుంది.
డాక్టర్ జాన్ పాల్ ప్రస్తుతం పీజీ చదువుతున్న వైద్యుడు. వైద్య విద్యార్థిగా ఉన్న ఈ యువకుడు గత కొంతకాలంగా డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. మొదట వ్యక్తిగతంగా వాడటం మొదలుపెట్టి, తర్వాత డబ్బు కొరత కారణంగా తన స్నేహితులతో కలిసి డ్రగ్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి తనకు తగినంత డబ్బు లేకపోవడంతో, వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచన చేశాడు.
హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్ అనే ముగ్గురు స్నేహితులు డ్రగ్స్‌ను ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల నుంచి తెప్పించేవారు. ఈ మత్తు పదార్థాలు నగరానికి చేరుకున్నాక, వాటిని డాక్టర్ జాన్ పాల్ అద్దె ఇంట్లో దాచిపెట్టేవారు. తరువాత వారు ఆ డ్రగ్స్‌ను చిన్న చిన్న ప్యాకెట్లుగా విభజించి, నగరంలోని యువతకు అమ్మకాలు జరిపేవారు.
డాక్టర్ జాన్ పాల్ ప్రధానంగా లావాదేవీలు జరిపే బాధ్యతను తీసుకున్నాడు. అతను కస్టమర్లను కనుగొని డ్రగ్స్‌ను అందించేవాడు. ఈ క్రమంలో వచ్చిన లాభాల్లో ఒక భాగం అతనికి ఇచ్చేవారని, అలాగే తాను వాడుకునే డ్రగ్స్‌ను ఉచితంగా పొందేవాడని ఎస్టిఎఫ్ విచారణలో తేలింది.
సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ ఎస్సై బాలరాజు, కానిస్టేబుల్ విజయ్ కృష్ణ సిబ్బందులు కలిసి డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో సోదాల నిర్వహించారు. ఈ క్రమంలో ఇంట్లో విపరీతంగా డ్రగ్స్ నిల్వ ఉన్నట్లు బయటపడింది.
డాక్టర్ ఇంట్లో మొత్తం ఆరు రకాల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 26.95 గ్రాముల ఓజి కుష్,6.21 గ్రాముల ఎండిఎం ఎ, 15 ఎల్ ఎస్ డి బాస్ట్స్, 1.32 గ్రాముల కొకైన్,5.80 గ్రాముల గుమ్మస్, 0.008 గ్రాముల హాసిస్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇవి మొత్తం మార్కెట్ విలువ రూ. 3 లక్షలుగా అంచనా వేశారు.
ఈ డ్రగ్స్ రాకెట్‌లో కీలక పాత్ర పోషించిన ప్రమోద్, సందీప్, శరత్ అనే ముగ్గురు స్నేహితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని ఎస్టిఎఫ్ వెల్లడించింది. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి శోధిస్తున్నారు.
ఒక డాక్టర్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం పట్ల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం అభినందించారు.
పట్టుబడిన జాన్ పాల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎస్టిఎఫ్ అధికారులు.. డ్రగ్స్ రాకెట్ వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ను చేధించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.