Sooji vs Oats: మన రోజువారీ పనుల్లో ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం చాలా ముఖ్యం. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉదయాన్నే బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకుని తింటారు. అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడంతో చాలామంది ఓట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అసలు వీటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో ప్రముఖ డైటీషియన్ కనికా మల్హోత్రా సోషల్ మీడియా ద్వారా వివరించారు. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓట్స్‌లో కరిగే ఫైబర్ అయిన బీటా గ్లూకాన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా.. కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నెమ్మదిగా జీర్ణం కావడానికి కూడా ఈ ఫైబర్ సహాయపడుతుంది. అందుకే మధుమేహం ఉన్నవారికి ఓట్స్ మంచి అల్పాహార ఎంపికగా చెప్పొచ్చు. అయితే ఎంత మోతాదులో తింటున్నాం, దాంతో పాటు ఏ పదార్థాలు కలుపుతున్నాం అనేదీ ముఖ్యం.
ఓట్స్‌లో శరీరానికి అవసరమైన ప్రోటీన్‌తో పాటు బి విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. బొంబాయి రవ్వలోనూ ప్రోటీన్, బి విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం లభిస్తాయి. అయితే ఓట్స్‌లో ఉండే ప్రోటీన్‌లో అవసరమైన అమైనో ఆమ్లాల సమతుల్యత మెరుగ్గా ఉంటుంది. రవ్వలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మాత్రం ఓట్స్‌తో పోలిస్తే తక్కువగా ఉంటాయి. కాబట్టి.. పోషకాల వైవిధ్యం కోరుకునేవారికి ఓట్స్ కొంత ముందుంటాయి.
Also Read: పాల ప్యాకెట్‌పై ‘పాశ్చరైజ్డ్’ అని ఉంటే అర్థం ఏంటి? ఇది తెలిస్తే ఇకపై పాలను మళ్లీ మరగబెట్టరు!
ఓట్స్‌లోని ఫైబర్ పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడుతుంది. మలబద్ధకం సమస్య తగ్గించడంలోనూ ఉపయోగపడొచ్చు. రవ్వలో ఉండే ఫైబర్ మలానికి పరిమాణం పెంచి, క్రమంగా విసర్జన జరిగేలా సహాయపడుతుంది. బాగా ఉడికించిన రవ్వ చాలామందికి సులభంగా జీర్ణమవుతుంది. కానీ గోధుమతో తయారవుతుంది కాబట్టి.. గ్లూటెన్ అలర్జీ లేదా సున్నితత్వం ఉన్నవారు దూరంగా ఉండాలి. ఓట్స్ సహజంగా గ్లూటెన్ రహితమైనవే అయినా, ప్యాకెట్‌పై కల్తీ లేదో చూసుకోవాలి.
ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఓట్స్ తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. దీంతో మధ్యలో ఆకలి వేయడం, అదనంగా తినడం తగ్గవచ్చు. రవ్వలోనూ ప్రోటీన్ ఉండటం వల్ల కొంతసేపు ఆకలి నియంత్రణలో ఉంటుంది. అయితే బరువు తగ్గడానికి ఒక్క ఆహారాన్ని ఎంచుకోవడం సరిపోదు. పరిమిత మోతాదులో తినడం, కూరగాయలు లేదా పప్పులు కలపడం, రోజూ శారీరక శ్రమ చేయడం ముఖ్యం. మొత్తానికి ఫైబర్, రక్తంలో చక్కెర నియంత్రణ పరంగా ఓట్స్‌కు పైచేయి ఉంది. అయినా రుచికి, అలవాటుకు తగ్గట్టు రవ్వను కూడా సమతుల్య ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
ఏది ఎంచుకున్నా చక్కెర, ఉప్పు ఎక్కువగా కలపకుండా చూసుకోండి. ఓట్స్‌ను పాలు, పెరుగు, గింజలు లేదా పండ్లతో తీసుకోవచ్చు. రవ్వ ఉప్మాలో కూరగాయలు, పల్లీలు, పెసరపప్పు కలిపితే భోజనం మరింత పోషకంగా మారుతుంది.
Also Read: చలికాలంలో ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కోసం మునగాకు సూప్.. తయారీ విధానం ఇదే!