Partner keeps doubting you| మీరు ఎక్కడికి వెళ్లినా, ఎవరితో మాట్లాడినా మీ పార్ట్‌నర్ (భర్త/భర్త) ప్రశ్నిస్తున్నారా? స్నేహితులతో మాట్లాడితే అనుమానం, బయటకు వెళితే.. ఎక్కడికి వెళావు? ఎవరతను అని ఆరా తీస్తున్నారా? ఫోన్‌లో మాట్లాడితే మరో ప్రశ్న! ఇలా ప్రతిదానికీ సమాధానం చెప్పడం వల్ల మీరు విసిగిపోతున్నారా? నిజాయితీగా ఉన్నప్పటికీ పదేపదే మీ ప్రవర్తనను నిరూపించుకోవాల్సి వస్తుందా? అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రేమ పేరుతో ప్రతిసారీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు.
సంబంధంలో ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. కానీ చిన్న విషయాలకే అనుమానించడం మొదలైతే బంధంలో సమస్యలు మొదలవుతాయి. మీరు ఎంత వివరించినా కొందరికి అనుమానాలు తగ్గకపోవచ్చు. పైగా ఒక ప్రశ్నకు సమాధానం చెబితే మరో ప్రశ్న ఎదురుకావచ్చు.
రిలేషన్‌షిప్ కంటెంట్ క్రియేటర్ అనుభవ్ జైన్ తన యూట్యూబ్ వీడియోలో ఇదే విషయాన్ని వివరించారు. ప్రతి విషయానికీ సుదీర్ఘంగా వివరణ ఇచ్చే బదులు ప్రశాంతంగా, స్పష్టంగా మాట్లాడాలని సూచించారు.
మీరు ఈ బంధం పట్ల నిజాయితీగా ఉన్నారని పార్ట్‌నర్‌కు చెప్పండి. అయితే కారణం లేకుండా పదేపదే అనుమానించడం మీకు బాధ కలిగిస్తోందని వివరించండి. ప్రతి ఆరోపణకు సమాధానం చెప్పుకుంటూ ఉండాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి.
సంబంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో మీ సంతోషాన్ని, ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టకూడదు. ఆరోగ్యకరమైన బంధానికి ప్రేమతో పాటు పరస్పర గౌరవం, నమ్మకం అవసరం. మీరు నిజాయితీగా ఉన్నప్పుడు ప్రతి ఆరోపణకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ ఒక్కరిపైనే ఉండదు. మీ అభిప్రాయాలను కూడా పార్ట్నర్ గౌరవించాలి. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడినప్పుడే అపార్థాలు తొలగుతాయి.
కొంతమంది భర్తలు తమ భార్య స్నేహితులు, కుటుంబ సభ్యుల విషయంలో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరిని కలిశారు? అంటూ పదేపదే ప్రశ్నిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ వ్యక్తిగత హద్దులను స్పష్టంగా తెలియజేయాలి. నిరంతరం ప్రశ్నించడం, ఆరోపణలు చేయడం వల్ల బంధంలో ఒత్తిడి పెరుగుతోందని చెప్పాలి. ఈ ప్రవర్తనలో మార్పు రావడానికి ఇద్దరూ ప్రయత్నించాలి.
Also Read: క్షణాల్లో అబద్దం అల్లేస్తారు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు తప్పులు దాచడంలో నిపుణులు
అనుమానాలతో పాటు తిట్టడం, అవమానించడం, బెదిరించడం మొదలైతే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ప్రవర్తన ప్రేమలో సహజమని భావించకూడదు. మీకు నమ్మకమైన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఈ విషయాన్ని పంచుకోండి. అవసరమైతే రిలేషన్‌షిప్ కౌన్సిలర్ సహాయం తీసుకోండి. భయం లేదా అభద్రత కలిగితే మీ భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వండి.
Also Read: చాణక్య నీతి.. నిజమైన స్నేహితులు ఎవరో, నటించే వారు ఎవరో ఇలా తెలుసుకోండి
ప్రేమ ఒక్కటే బంధాన్ని నిలబెట్టలేదు. పరస్పర గౌరవం, నమ్మకం, నిజాయితీతో కూడిన సంభాషణ కూడా అవసరం. ప్రతిసారీ మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ప్రయత్నించకుండా, మీ భావాలను స్పష్టంగా చెప్పండి. మీ హద్దులను గౌరవించేలా చూసుకోండి.
ఆరోగ్యకరమైన బంధంలో ఇద్దరికీ భద్రత, గౌరవం ఉండాలి. సంబంధాన్ని మెరుగుపరచుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉంటుంది.