Sanna Karam Pusa: ఇంట్లోనే పిండి వంటలు చేసుకోవడం అంటే చాలామందికి ఇష్టం. ముఖ్యంగా ఒకసారి చేసి డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి వీలుండే చిరుతిళ్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి వాటిలో ‘సన్న కారంపూస’ కూడా ఒకటి. పలుచగా, పొడవుగా ఉండే ఈ కారంపూసను నోట్లో వేసుకోగానే కరకరలాడే రుచి, కారపు ఘాటు తినాలనే కోరికను మరింత పెంచుతాయి. పిల్లలకు స్నాక్‌గా ఇవ్వాలన్నా, సాయంత్రం టీతో పాటు సర్వ్ చేయాలన్నా ఈ వంటకం బాగుంటుంది. పైగా ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంట్లోనే సన్న కారంపూస ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..
శనగపిండి – రెండు కప్పులు
బియ్యప్పిండి – అర కప్పు
కారం – ఒకటిన్నర టీస్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
వాము – ఒక టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
వేడి నూనె లేదా వెన్న – రెండు టేబుల్ స్పూన్లు
నీళ్లు – పిండి కలపడానికి సరిపడా
డీప్ ఫ్రైకి సరిపడా నూనె
Also Read: చలికాలంలో ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కోసం మునగాకు సూప్.. తయారీ విధానం ఇదే!
ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో జల్లించిన శనగపిండి, బియ్యప్పిండి వేయాలి. బియ్యప్పిండి వేయడం వల్ల కారప్పూస మెత్తబడకుండా ఎక్కువ రోజులు కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. వామును చేతితో కాస్త నలిపి పిండిలో వేస్తే మంచి సువాసన వస్తుంది. తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వెన్న లేదా బాగా వేడి చేసిన నూనె వేసి పిండికి పట్టేలా చేతితో బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల కారప్పూస గుల్లగా, నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా వస్తుంది.
ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా.. అలాగని మరీ పల్చగా కాకుండా చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే జంతికల గొట్టం నుండి ఒత్తడం కష్టమవుతుంది. పిండి సిద్ధమయ్యాక, స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.
ఈలోపు సన్నని రంధ్రాలు ఉన్న జంతికల గొట్టానికి లోపల కొద్దిగా నూనె రాసి, కలుపుకున్న పిండిని అందులో నింపాలి. నూనె బాగా వేడయ్యాక, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, నేరుగా నూనెలో గుండ్రంగా కారప్పూసను ఒత్తుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేయకుండా కడాయికి సరిపడా మాత్రమే వేయాలి. రెండు వైపులా బంగారు రంగులోకి మారి, నురగ తగ్గే వరకు వేయించుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే నెల రోజుల పాటు తాజాగా, కరకరలాడుతూ ఉంటాయి.
Also Read: ఆదివారం లంచ్‌కు అదిరిపోయే రెసిపీ.. గోధుమ పిండితో యమ్మీ యమ్మీ మసాలా కుల్చా!