Middle Class Families: ఒక్కరోజు ఆర్భాటం.. పదేళ్ల అప్పుల భారం! పక్కవాడు చేశాడని పోటీ పడితే.. ఆఖరికి మిగిలేది వడ్డీల వలయం! మళ్లీ మళ్లీ చేస్తామా? అనిమీకు మీరే సరిపెట్టుకోకండా ఒక్కసారి ఖర్చు చేసే ముందు.. ఆ అప్పులు తీర్చేది ఎవరని ఒక్క క్షణం ఆలోచిండి. లేకుంటే నెలజీతం లెక్కలు తారుమారై, మధ్యతరగతి కుటుంబం పేదరికంలోకి జారిపోవడానికి ఎంతోకాలంపట్టదు .
ఒక్కసారి 30 ఏళ్లు వెనక్కి వెళ్దాం..
ఒక్కసారి 30 ఏళ్లు వెనక్కి వెళ్దాం.. అప్పట్లో దావత్ అంటే ఆడంబరం కాదు, ఆత్మీయత! ఇంట్లోనే పందిరి వేసేవారు. బంధువులంతా కలిసి పనిచేసుకునేవారు.భోజనం మెనూలోనూ ఎలాంటి హంగులు ఉండేవి కావు. సింపుల్, బ్యూటిఫెల్ .టేస్టి బగారా అన్నం, తెల్ల అన్నం, మటన్ కూర, చికెన్ కూర.. మాంసం తినని వాళ్ల కోసం పప్పు లేదా ఆలుగడ్డ, వంకాయ మసాలా, చివర్లో వేడివేడి సాంబార్, పెరుగు, స్వీట్గా ఒక లడ్డూ లేదా డబల్ కా మీఠా! అంతే.. అందరూ ఎంతో తృప్తిగా, కడుపునిండా తిని దీవించివెల్లేవారు.
బిడ్డ కడుపులో ఉన్నప్పటినుంచే భారీ ఈవెంట్స్..
అప్పట్లో ఆడపిల్ల పెద్దమనిషి అయినా, ఇంట్లో ఒడి బియ్యం వండినా శ్రీమంతం అయినా అత్యంత ఆప్తులు కేవలం ఇరుగుపొరుగు, మధ్య ఇంట్లోనే ఎంతో పద్ధతిగా జరిగిపోయేవి. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు బిడ్డ కడుపులో ఉన్నప్పటినుండే పెళ్లి వరకు ప్రతీదీ ఒక భారీ ఈవెంట్ అయిపోయింది!
మళ్లీ మళ్లీ చేస్తామా? అనే ఒక్క మాట..
శ్రీమంతంతో మొదలై..21 వ రోజు బారసాల, ఒడిబియ్యం, ఫస్ట్ బర్త్ డే.. ఆడపిల్లైతే పెద్దమనిషి ఫంక్షన్, హాఫ్ శారీ ఫంక్షన్.. అబ్బాయి అయితే పంచెల దావత్!ఆ తర్వాత ఎంగేజ్మెంట్, ప్రీ-వెడ్డింగ్ షూట్లు, మెహందీ, హల్దీ, పెళ్లి, రిసెప్షన్.. ఇలా లిస్ట్ పెరుగుతూనే ఉంది. పెల్లిలాంటి పెద్ద పంక్షన్ల ను పక్కన పెడితే కొన్ని దావత్ లను ఇంట్లో సింపుల్గా చేసుకునే అవకాశం ఉన్నా ‘ఇంట్లోనే చేసుకున్నారట’ అని ఎక్కడ బద్నాం అవుతామో అన్న భయం!దాంతో అప్పో సప్పో చేసి ఫంక్షన్ హాళ్లు బుక్ చేస్తున్నారు.ఒక్కరోజు వేడుకకు వేలకు వేలు పోసి పట్టుచీరలు, డిజైనర్ బట్టలు కొంటున్నారు. 50, 60 రకాల వంటకాలు పెట్టి, అందులో సగం చెత్తబుట్ట పాలు చేస్తున్నారు.చివరికి ఒడిబియ్యం పూయాలన్నా కర్చు లక్ష రూపాయలు దాటిపోతోంది! ‘మళ్లీ మళ్లీ చేస్తామా?’ అనే ఒక్క డైలాగ్తో లక్షలు లక్షలు కర్చుపెడుతున్నారు.
వేడుకలకు పెట్టే లక్షలు.. పిల్లల చదువుకు దాచండి!
కానీ ఒక్క నిజం గుర్తుంచుకోండి.. ఉన్నోడు 50 లక్షలు పెట్టి పెళ్లి చేసినా తట్టుకుంటాడు. కానీ మధ్యతరగతి వాడు పోటీ పడితే జీవితాంతం కోలుకోలేడు!మీరు పెట్టిన 60 రకాల వంటకాలను జనం రెండు రోజుల్లో మర్చిపోతారు. కానీ మీరు తెచ్చిన అప్పులకు వడ్డీలు మాత్రం ఏళ్ల తరబడి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి.అసలు జీవితంలో అతి ముఖ్యమైన వేడుక ఏది? పెళ్లి, ఆ తర్వాత వ్రతం మాత్రమే! మిగిలిన దావత్లన్నీ ఇంట్లో మన వాళ్ల మధ్య ఆత్మీయంగా చేసుకోవాల్సినవే. చిన్నపిల్లల వేడుకలకు పెట్టే లక్షలను.. వాళ్ల ఉన్నత చదువులకు దాచండి. ఫంక్షన్ల కంటే పిల్లల భవిష్యత్తే ముఖ్యం!
భద్రం.. బీ కేర్ఫుల్ బ్రదర్!
గుర్తుంచుకోండి.. పక్కవారి మెప్పు కోసం మన ఇంటి పునాదులను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసుకోవద్దు.గతంలో ఇవన్నీ ఇంత ఆడంబరంగా చేశారా అని ఒక్కసారి మీ మనసును ప్రశ్నించుకోండి. ఆడంబరాలకు పోయి నెలజీతం లెక్కలు తారుమారు చేసుకోకండి.భద్రం.. బీ కేర్ఫుల్ బ్రదర్! ఆలోచించండి.. మధ్యతరగతి అప్పుల పాలు కాకుండా కాపాడుకోండి!
Also Read: రాజస్థాన్ రైల్వే ట్రాక్ పేలుడు వెనుక పాక్ గూఢచార సంస్థ.. డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా