Ashadamlo gorintaku: ఆషాడం స్టార్ట్ అయ్యిందంటే చాలు ఆడవాళ్లు అందరి చేతులకు గోరింటాకు ఉంటుంది. అయితే ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం దీని వెనుక ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి. గోరింటాకులో శరీరంలోని వేడిని తగ్గించే గుణం ఉంది, అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆషాఢమాసంలో వాతావరణంలో మార్పుల కారణంగా శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది, కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం ద్వారా ఆ వేడిని తగ్గించుకోవచ్చని పెద్దలు చెబుతారు.
గోరింటాకు వల్ల కలిగే లాభాలు
చర్మ వ్యాధుల నివారణ: ఆషాఢ మాసం వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం. ఈ కాలంలో వాతావరణం తేమగా ఉండటం వల్ల చర్మ వ్యాధులు, గోళ్ల సమస్యలు, సూక్షజీవుల వల్ల ఇన్పెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. గోరింటాకులో యాంటీ సెప్టిక్, యాంటీ బయోటిక్ గుణాలు ఉండటం వల్ల చర్మాన్ని రక్షిస్తాయి, ఇన్పెక్షన్లను నివారిస్తాయి.
శరీర ఉష్ణోగ్రత నియంత్రణ: గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్షాకాలంలో శరీరంలో నిలిచిపోయిన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది. ఇది శరీరాన్ని చల్లబరచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతారు.
గోళ్ల ఆరోగ్యం: మహిళలు ఇంటి పనులు, వంట పనులు చేస్తున్నప్పుడు నీటితో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటారు. దీనివల్ల గోళ్ళు పెళుసుబడటం లేదా గోరు చుట్టు వంటి సమస్యలు రావచ్చు. గోరింటాకు గోళ్లను రక్షిస్తుంది మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.
రోగ నిరోధక శక్తి: గోరింటాకు రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుతుందని కొందరు నిపుణులు అంటున్నారు.
ఒత్తిడి తగ్గించడం: గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించే లక్షణం ఉందని చెబుతారు. ఇది మానసిక శాంతిని కలిగిస్తుంది.
ఔషధ గుణాలు: గోరింట చెట్టు యొక్క ఆకులు, పూలు, బెరడు మరియు విత్తనాలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. గోరింట పొడిని మందుగా లేదా నూనెగా వాడటం పెద్దల చిట్కా వైద్యంలో సాధారణం.
ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవడం కేవలం ఆరోగ్య ప్రయోజనాల కోసం మాత్రమే కాదు, ఇది ఒక సాంప్రదాయంగా కూడా కొనసాగుతుంది.
Also Read: కూరగాయల్లో కింగ్.. తింటే అనేక వ్యాధులకు చెక్.. ఎంటో తెలుసా?
సౌందర్యం: గోరింటాకు చేతులకు, కాళ్లకు అందమైన ఎరుపు రంగును ఇస్తుంది. ఇది మహిళల సౌందర్యాన్ని పెంచుతుంది. ఇది ఆడపిల్లలకు ఒక ఆకర్షణీయమైన అలంకరణగా పనిచేస్తుంది.
కొత్త జంట: ఆషాఢమాసంలో కొత్తగా పెళైన మహిళలు తమ పుట్టింటికి వెళ్తారు. ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం వారికి తమ భర్త ఆరోగ్యం, సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది.
గౌరిదేవి : గోరింటాకు గౌరీదేవి ప్రతీకగా భావిస్తారు. అలాగే ఆషాఢంలో చిటికెన వేలికి పెట్టిన గోరింటాకు కార్తీక మాసం నాటికి గోరు చివరకు చేరుతుంది. ఈ గోరు నుంచి వచ్చిన నీళ్లు శివలింగంపై పడితే పుణ్యం లభిస్తుందని కొందరు నమ్ముతారు.
సౌభాగ్యానికి ప్రతీక: గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. పెళైన మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల వారి సౌభాగ్యం, భర్త ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తారని నమ్ముతారు.
ఇతర సందర్భాలు: ఆషాఢమాసంతో పాటు, అట్టతద్ది, పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర పండుగల సందర్భంలో కూడా గోరింటాకు పెట్టుకుంటారు. ఇది సాంప్రదాయంలో భాగంగా, ఆరోగ్య ప్రయోజనాల కోసం చేస్తారని చెబుతున్నారు.