ఆహారం మానేయడం ద్వారా బరువు తగ్గాలని ఆలోచించే వారి సంఖ్య అధికంగానే ఉంది. అలా రాత్రిపూట భోజనం మానేసేవారి సంఖ్య కూడా ఎక్కువే. ఒక నెలరోజుల పాటు రాత్రిపూట భోజనం మానేయడం వల్ల మీ శరీరంపై, అలాగే ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావాలు పడతాయో తెలుసుకోండి.
బరువు తగ్గడం కోసం మీ దినచర్యలో రాత్రి భోజనాన్ని తొలగించాలనుకుంటున్నారా? అలా అయితే మీ శరీర పనితీరులో ఊహించని మార్పులు జరగవచ్చు. ఇది కొంతమందికి అనుకూలంగా ఉన్నా.. మరి కొందరి ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు.
బరువు తగ్గుతారు కానీ…
వైద్యులు చెబుతున్న ప్రకారం రాత్రిపూట భోజనం ఆపివేయడం వల్ల శరీరంలో తక్షణమే ఎన్నో మార్పులు కలుగుతాయి. రాత్రిపూట భోజనం పూర్తిగా మానేస్తే మీరు రోజువారీ తీసుకునే ఆహారం కూడా చాలా వరకు తగ్గిస్తారు. దీనివల్ల కేలరీలు తగ్గిపోతాయి. త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఉపాయమే కావచ్చు. కానీ శరీరంలోని శక్తి స్థాయిలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
శరీరానికి తగినంత ఆహారం అందనప్పుడు రక్తంలో చక్కెర సాంద్రత తగ్గిపోతుంది. అలాగే తల తిరగడం, ప్రతిదానికి చిరాకు పడడం, తీవ్రంగా అలసటగా అనిపించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. శరీరంలో నిల్వ అయినా గ్లూకోజు, గ్లైకోజెన్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి.
ఆకలి పెరిగిపోతుంది
ముఖ్యంగా రాత్రిపూట ఆహారం మానేయడం వల్ల ఆకలి పెరిగిపోతుంది. ఎందుకంటే ఆకలిని ప్రేరేపించే గ్రెలిన్ హార్మోన్ ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. దీనివల్ల తరచూ ఆకలి వేస్తుంది. మీరు ఏదో ఒకటి ప్రతి గంటకి తినాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీనివల్ల మీరు మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది. శరీరం దాని అవసరాలను తీర్చుకోవడానికి ఇలా ఎక్కువగా ఆకలి వేసేలా చేస్తుంది. ఇది దీర్ఘకాలికంగా సాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
పోషకాహారం లోపం
రాత్రిపూట భోజనం మానేయడం వల్ల బరువు తగ్గడం వంటి స్వల్పకాలిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది చూసి మీరు ఆనందిస్తే… దీర్ఘకాలికంగా మాత్రం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పోషకాహార లోపం వస్తుంది. రాత్రిపూట భోజనం మానేయడం వల్ల శరీరానికి అవసరమైన అనేక పోషకాలు లోపిస్తాయి. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ పైన మొత్తం శక్తి స్థాయిలపైన ప్రభావం పడుతుంది.
ప్రొటీన్ లోపంతో సమస్యలు
అలాగే శరీరానికి కావలసినంత ప్రోటీన్ అందదు. దీనివల్ల కండరాల నష్టం జరుగుతుంది. దీర్ఘకాలికంగా చూసుకుంటే కండరాలు బలహీనపడతాయి. మొదట్లో బరువు తగ్గినట్టు అనిపించినా, దీర్ఘకాలికంగా చూసుకుంటే బరువు తగ్గడం అనేది కష్టతరంగా మారుతుంది. ఆహారం రాత్రిపూట మానేసిన తర్వాత.. తిరిగి తినడం ప్రారంభించినప్పుడు బరువు చాలా త్వరగా పెరిగిపోతారు. అలాగే ఆహార రుగ్మతలు వస్తాయి. అలాగే చెడు ఆహారపు అలవాట్లు కూడా మొదలయ్యే అవకాశం ఉంది.
రాత్రిపూట భోజనం మానేయడమనేది వైద్యులు చెబుతున్న ప్రకారం మంచి అలవాటు కాదు. ఇది జీవక్రియ రేటు, శక్తి స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల ప్రొడక్టివిటీ పై ప్రభావం పడుతుంది. మీ శరీరం ఎక్కువ కొవ్వును నిల్వ చేయడానికి కూడా ఇది కారణం కావచ్చు. అలాగే రాత్రిపూట ఆహారం తినకుండా మీరు ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండలేరు.
రాత్రిపూట భోజనం దాటవేయడం వల్ల మీకు రోజంతా నీరసంగా అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. ఓపిక తగ్గిపోతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. ఏ విషయాన్నీ గుర్తు పెట్టుకోలేరు. నిర్ణయాలు కూడా సరిగా తీసుకోలేరు. కాబట్టి రాత్రిపూట భోజనం మానేయడం అనేది మంచి పద్ధతి కాదు.
ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, మధుమేహంతో బాధపడుతున్న వారు, క్రీడాకారులు రాత్రిపూట భోజనాన్ని మానేయడం ఏ మాత్రం సరైన నిర్ణయం కాదు.