విమాన ప్రయాణం ఖరీదైనది. కేవలం ధనవంతులు మాత్రమే చేయగలిగేది. అయితే అతి తక్కువ ధరకే ఒక్కోసారి విమాన టికెట్లు కొనుగోలు చేసే అవకాశం దక్కుతుంది. దానికోసం మీరు గూగుల్ ఫ్లైట్స్ అనే ఫీచర్ సహకారం తీసుకోవాలి. గూగుల్ ఫ్లైట్స్ ద్వారా అన్నిటికంటే తక్కువగా ఏ విమాన టికెట్లు ఉన్నాయో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
గూగుల్ ఫ్లైట్స్ ఫీచర్
రెండేళ్ల క్రితమే గూగుల్ ఫ్లైట్స్ ఫీచర్ ని అమల్లోకి తెచ్చింది గూగుల్. ఎన్నో విమానయాన సంస్థలు ఇండియాలో ఉన్నాయి. వాటన్నింటిలో అతి తక్కువగా ఏ ఫ్లైట్ టికెట్ ఉందో వెతికి చెప్పేదే ఈ గూగుల్ ఫ్లైట్స్ ఫీచర్. ప్రయాణికులకి అత్యంత చవకైన విమాన టికెట్లను వెతికి అందిస్తుంది. కాబట్టి మీరు ఫ్లైట్లో ప్రయాణం చేయాలనుకుంటే గూగుల్ ఫ్లైట్స్ లోనే సెర్చ్ చేసి తక్కువ ధరకు ఉన్న ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చు.
చీపెస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి
గూగుల్ ఫ్లైట్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ మీ ట్రిప్ వివరాలను ఎంటర్ చేయాలి. అక్కడే చీపెస్ట్ అనే ట్యాబ్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయడం వల్ల మీరు వెళ్లాలనుకుంటున్న గమ్యానికి ఏ ఫ్లైట్లు తక్కువ ధరకి తీసుకువెళ్తున్నాయో గూగుల్ ఫ్లైట్ వెతికి చెబుతుంది. దాని ఆధారంగా మీరు ఆ ఫ్లైట్ ను బుక్ చేసుకోవచ్చు.
గత ఏడాది 1.7 బిలియన్ల మంది ఆన్లైన్లో విమానాలను బుక్ చేసుకోవడానికి గూగుల్ ఫ్లైట్స్ సహకారాన్ని తీసుకున్నారు. తక్కువ ధరలకు టికెట్లను పొందాలన్న ఆలోచనతోనే వారు ఈ ఫ్లాట్ ఫామ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది.
గూగుల్ ఫ్లైట్ వెబ్ సైట్లో మీరు ఎంటర్ అయ్యాక అందులో తేదీ, గమ్యస్థానం టైప్ చేయాలి. తర్వాత అది కేవలం ఆరోజు ఉన్న ఫ్లైట్లలో అత్యల్ప ధరను చూపించడమే కాదు కొన్ని నెలల వరకు ఉన్న అత్యల్ప ధరలను మీకు అక్కడ సూచిస్తుంది. దాని ద్వారా మీరు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఎప్పుడు ధరలు తక్కువ?
సాధారణంగా వారం మధ్యలో అంటే మంగళవారాలు, బుధవారాల్లో ఛార్జీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. వారాంతాల్లో మాత్రం విమాన చార్జీలు అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు తక్కువ ధరలో విమాన ప్రయాణం చేయాలనుకుంటే మంగళ, బుధవారాల్లో ప్రయాణం చేసేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీరు 20 శాతం నుంచి 30 శాతం వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
గూగుల్ ట్రాకింగ్ ఫీచర్
అలాగే google ఫ్లైట్స్ ట్రాకింగ్ ఫీచర్ ను కూడా అందిస్తుంది. అంటే మీరు ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత గూగుల్ ఫ్లైట్స్ లో ధర ట్రాకింగ్ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవాలి. దానికి మీ ఇమెయిల్ ఐడిని జోడించాలి. దీనివల్ల విమాన చార్జీలు తగ్గినప్పుడల్లా అది మీకు ఇమెయిల్ ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తుంది. అప్పుడు తక్కువ ధరకే టికెట్ వచ్చినప్పుడు మీరు కొనుగోలు చేయవచ్చు. దాని ద్వారా మీరు చవకగా ప్రయాణం చేయవచ్చు.
ఫోన్లో కూడా బుక్ చేయవచ్చు
గూగుల్ ఫ్లైట్స్ అనేది మొబైల్లో కూడా సులువుగా ఉపయోగించే వెబ్ సైట్. ఇది వేగవంతంగా పనిచేస్తుంది. దీన్ని వాడడం కోసం ఎలాంటి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా గూగుల్ ఫ్లైట్స్ వెబ్సైట్ను ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఆన్లైన్లో విమానాలను బుక్ చేసుకోవడానికి బ్రౌజర్ నుండే దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ధరలను ట్రాక్ చేయవచ్చు. అలాగే టికెట్ కూడా ఫోన్ నుంచే బుక్ చేసుకోవచ్చు.
మీరు టికెట్ బుక్ చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత గూగుల్ ఆ విమానాయాన సంస్థ వెబ్సైటుకు మిమ్మల్ని తీసుకెళుతుంది .అక్కడే మీరు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ప్రయాణికులు ఎలాంటి ఒత్తిడి లేకుండా చౌకగా విమాన టికెట్లను కనుగొనడంలో గూగుల్ ఫ్లైట్స్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ సమయం, ప్రయాణం, ధనం… అన్నీ తక్కువగా ఖర్చు అవుతాయి. తొలిసారి విమాన ప్రయాణం చేసే వారికి గూగుల్ ఫ్లైట్స్ ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది.