Fruits for summer: ఎండలు మండిపోయే వేసవి కాలంలో మన శరీరం అధిక వేడిని తట్టుకోవడానికి ఎక్కువ నీటిని కోల్పోతుంది. దీని వల్ల నీరసం, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. కేవలం నీళ్లు తాగడం వల్ల మాత్రమే కాకుండా.. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మనం రోజంతా ఉల్లాసంగా ఉండొచ్చు. ప్రకృతి సిద్ధంగా లభించే కాలానుగుణ పండ్లు మనల్ని ఎండ నుంచి రక్షించడమే కాకుండా, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడే ఆ పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో ఆరోగ్యాన్ని ఇచ్చే బెస్ట్ ఫ్రూట్స్:
వేసవి కాలం అంటేనే రకరకాల రుచికరమైన పండ్ల సీజన్. అధిక వేడి నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి ఈ కింది పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.
1. పుచ్చకాయ:
వేసవి పండ్ల జాబితాలో పుచ్చకాయ మొదటి స్థానంలో ఉంటుంది. ఇందులో దాదాపు 92% నీరు ఉంటుంది. ఇది శరీరానికి తక్షణమే శక్తిని ఇవ్వడమే కాకుండా.. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ‘లైకోపీన్’ చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడుతుంది.
2. తాటి ముంజలు:
వేసవిలో మాత్రమే లభించే తాటి ముంజలు అమృతం లాంటివి. ఇవి శరీరానికి సహజమైన చలవను ఇస్తాయి. కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి కీలకంగా పని చేస్తాయి. వీటిలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
3. మామిడి పండ్లు :
పండ్లలో రాజు అయిన మామిడి పండు వేసవిలో విరివిగా లభిస్తుంది. ఇందులో విటమిన్-A, విటమిన్-C , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడానికి తోడ్పడతాయి. అయితే.. మామిడి పండ్లను మితంగా తీసుకోవడం మంచిది.
4. కర్బూజ:
కర్బూజ పండు శరీరానికి మంచి చలవనిస్తుంది. ఇందులో ఉండే విటమిన్-c, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే.. కర్బూజను జ్యూస్ రూపంలో లేదా ముక్కలుగా తీసుకోవడం ఉత్తమం.
5. నిమ్మ, సిట్రస్ పండ్లు:
నారింజ, బత్తాయి, నిమ్మ పండ్లలో విటమిన్-C సమృద్ధిగా ఉంటుంది. వేసవిలో వచ్చే అలసటను తగ్గించి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి నిమ్మరసం ఒక అద్భుతమైన డ్రింక్. ఇది రక్తహీనతను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
6. ద్రాక్ష :
నలుపు , ఆకుపచ్చ ద్రాక్షలు వేసవిలో మేలు చేస్తాయి. వీటిలో ఉండే పొటాషియం, నీటి శాతం గుండె ఆరోగ్యానికి మంచిది. ఇవి శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో సహాయ పడతాయి.
జాగ్రత్తలు , సూచనలు:
తాజా పండ్లనే తినండి: వీలైనంత వరకు తాజా పండ్లను మాత్రమే ఎంచుకోండి. ప్యాక్ చేసిన జ్యూస్‌ల కంటే నేరుగా పండును తినడం లేదా ఇంట్లోనే జ్యూస్ చేసుకుని తాగడం మంచిది.
చక్కెరను తగ్గించండి: పండ్ల రసాల్లో కృత్రిమ చక్కెరను కలపకుండా తాగడానికి ప్రయత్నించండి.
సరైన సమయం: పండ్లను ఉదయం పూట లేదా సాయంత్రం స్నాక్ లాగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
వేసవి ఆరోగ్యంగా ఉండాలంటే.. కేవలం ఏసీ గదుల్లో ఉండటం మాత్రమే కాదు. లోపలి నుంచి శరీరాన్ని చల్లబరచుకోవడం ముఖ్యం. పైన పేర్కొన్న పండ్లను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మీరు ఎండ వేడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.