Vinayaka Chavithi moon sighting: భారతీయ సంస్కృతిలో ప్రతి పండగ వెనుక ఒక అర్థం, పరమార్థం, అలాగే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ముఖ్యంగా వినాయక చవితి రోజు ఎంతో భక్తిశ్రద్ధలతో విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తాం. అయితే ఈ పండగ రోజు ఒక విచిత్రమైన ఆచారం మన మధ్య ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే.. చవితి రోజు పొరపాటున కూడా ఆకాశంలో చంద్రుడిని చూడకూడదు. ఒకవేళ చూస్తే.. ఇతరుల నుంచి లేనిపోని అపనిందలు, తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు.ఇంతకీ ఈ నమ్మకం ఎప్పుడు మొదలైంది? పురాణాలు దీని గురించి ఏం చెబుతున్నాయి? ఇప్పుడు చూద్దాం.
పురాణ కథల ప్రకారం ఒక సారి గణేశుడు కుబేరుడి ఇంట్లో విందు ఆరగించి, రాత్రి సమయంలో తన వాహనమైన మూషికం (ఎలుక) మీద ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో మార్గమధ్యంలో ఒక పెద్ద పాము ఎదురుకావడంతో ఎలుక బెదిరిపోతుంది. దీంతో వినాయకుడు కిందపడిపోతాడు. అప్పుడు ఆయన పొట్ట పగిలి తిన్న కుడుములన్నీ కింద పడతాయి. వెంటనే వినాయకుడు వాటిని మళ్లీ సర్దుకుని తన పొట్టకు పామును చుట్టుకుంటాడు. ఆకాశంలో నుంచి ఇదంతా చూస్తున్న చంద్రుడు వినాయకుడి రూపం చూసి బిగ్గరగా నవ్వుతాడు.
చంద్రుడి అహంకారానికి, ఎగతాళికి కోపగించిన వినాయకుడు, నీ అందం మీద నీకు గర్వం ఎక్కువైంది, ఈ రోజు నుంచి నీ రూపం మాయమైపోతుంది. ఏ రోజైతే నువ్వు నన్ను చూసి నవ్వావో అదే రోజు నిన్ను చూసినవాళ్ళు అపనిందలు మూటగట్టుకుంటారు అని శపిస్తాడు. ఆ తర్వాత చంద్రుడు తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడంతో.. వినాయకుడు శాపాన్ని కొద్దిగా సడలిస్తాడు. వినాయక చవితి రోజు మినహా మిగతా రోజుల్లో చంద్రుడిని చూస్తే ఎలాంటి దోషం ఉండదని, కేవలం చవితి నాడు మాత్రమే చంద్రదర్శనం నిషిద్ధమని చెబుతాడు.
మరి ఈ శాపం నుంచి బయటపడే మార్గం లేదా? మన పూర్వీకులు దీనికి ఒక చక్కటి పరిహారం కూడా చెప్పారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే, సిమంతక మణికి సంబంధించిన పౌరాణిక కథను చదువుకోవడం లేదా వినడం ద్వారా ఆ దోషం తొలగిపోతుందని నమ్ముతారు. లేదా ఒక చిన్న రాయిని ఇతరుల ఇంటి మీదకి వేసి, వారి నుంచి తిట్లు తింటే ఆ అపనింద ఆటోమేటిక్‌గా తొలగిపోతుందనే చమత్కారమైన ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది.
Also Read: వినాయక చవితి తిథి వివరాలు, తొలి పూజ విశిష్టత!
ఇక ఈనాటి జనాల ఆలోచనల ప్రకారం చూస్తే.. ఇది కేవలం మూఢనమ్మకం కాదని, దీని వెనక మానసిక ప్రశాంతత , ఖగోళ పరమైన అంశాలు కూడా ఉన్నాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. శ్రావణ లేదా భాద్రపద మాసంలో వచ్చే మేఘావృతమైన వాతావరణంలో చంద్రుడి కాంతిలో వచ్చే మార్పుల వల్ల కొన్నిసార్లు ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావచ్చుని, లేదా పండగ రోజు రాత్రి పూట ప్రశాంతంగా కుటుంబంతో గడపాలనే ఉద్దేశంతో పెద్దలు ఈ నిబంధన పెట్టి ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కారణం ఏదైనా..మనం ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తే వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ పండగ రోజుల్లో ఒక ప్రత్యేక చర్చగా మారుతూనే ఉంది.