Ganesha idols : మనదేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండగల్లో వినాయక చవితి ఒకటి. ఈ పండగ రోజు ప్రతి వీధిలో, ప్రతీ ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. అయితే.. కొద్ది రోజుల వేడుకల కోసం మనం తీసుకువచ్చే విగ్రహాలు మన పర్యావరణంపై ఎంతటి దుష్ప్రభావాన్ని చూపుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? మార్కెట్‌లో అమ్మే ఆకర్షణీయమైన విగ్రహాల వెనక ఎంతో పెద్ద పర్యావరణ ముప్పు దాగి ఉంది. అందుకే.. ఈసారి వినాయక చవితికి కొన్ని రకాల విగ్రహాలను పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదు. అవేంటంటే ?
మార్కెట్లో లభించే చాలా విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేయబడుతున్నాయి. ఇవి తక్కువ ఖర్చుతో, చూడడానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ వీటిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు ఇవి కరగడానికి నెలల సమయం పడుతుంది. అంతేకాకుండా.. వీటి తయారీకి వాడే రంగుల్లో సీసం,పాదరసం, కాడ్మియం వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు చెరువులు, నదుల నీటిలో కలిసిపోయి జల చరాలను, నీటి వనరులను పూర్తిగా విషపూరితం చేస్తున్నాయి. ఇలాంటి పీఓపీ విగ్రహాలను ఇంటికి తెచ్చి పూజించడం ద్వారా ఆరోగ్యపరంగా కూడా పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే, ప్లాస్టిక్ లేదా థర్మోకోల్ తో తయారు చేసిన చిన్న విగ్రహాలను కూడా పూర్తిగా నివారించాలి. ఇవి ఎప్పటికీ కుళ్ళిపోవు. కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికల ప్రకారం కూడా ప్లాస్టిక్ , పీఓపీ విగ్రహాల వాడకం చట్ట రీత్యా నేరం. మన సంప్రదాయం ఎప్పుడూ ప్రకృతితో మమేకమై బతకమని చెబుతుంది కానీ.. ప్రకృతిని నాశనం చేయమని ఎక్కడా చెప్ప లేదు. వినాయకుడిని ప్రకృతి స్వ రూపంగా భావిస్తాం కాబట్టి.. ఆయన పూజ కోసం ప్రకృతికి హాని చేసే విగ్రహాలను ఎట్టి పరిస్థితు ల్లోనూ ఎంచు కోకూడదు.
మరి ఎలాంటి విగ్రహాలు కొనాలి? మార్కెట్లో ఇప్పుడు పూర్తిగా సహజ సిద్ధ మైన మట్టి తో చేసిన విగ్రహాలు కూడా లభిస్తున్నాయి. ఈ మట్టి విగ్రహాలను పసుపు, కుంకుమ, సహజ సిద్ధ మైన కూరగాయల రంగులతో అలంకరిస్తారు. వీటిని నిమజ్జనం చేసిన క్షణాల్లో నీటిలో కలిసి పోతాయి. అంతే కాదు.. విత్తనాలతో తయారు చేసిన ‘సీడ్ గణేశా’విగ్రహాలు కూడా ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ విగ్రహాలను పూల కుండీలలో నిమజ్జనం చేస్తే, అందులోని గింజల ద్వారా మొక్కలు మొలుస్తాయి. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది.
Also Read: వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే..అపనిందలు వస్తాయా? అసలు రహస్యం ఇదే!
ఈ వినాయక చవితి పండగకు మనం ప్రతిజ్ఞ చేద్దాం. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు దూరంగా ఉంటూ.. స్వచ్ఛమైన మట్టి విగ్రహాలను మాత్రమే ఇంటికి తెచ్చుకుందాం. భావి తరాలకు స్వచ్ఛ మైన నీటిని, పరి శుభ్రమైన వాతా వరణాన్ని అందిద్దాం. మన భక్తి ప్రకృతి కి హాని కాకుండా.. ప్రకృతిని కాపాడేలా ఉండాలి!