BRS MLAs: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ (గులాబీ) పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ అంతర్మథనాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు శాసనసభలో ప్రజా సమస్యలపై గళం వినిపించలేకపోతున్నామనే అసంతృప్తి, మరోవైపు పార్టీ అధిష్టానం తీసుకునే తొందరపాటు నిర్ణయాల కారణంగా సభకు దూరంగా ఉండాల్సి వస్తోందనే భావన వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే పరిస్థితి గులాబీ ఎమ్మెల్యేలది.
అసెంబ్లీ సమావేశాలు అంటేనే నియోజకవర్గ సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు ఒత్తిడి పెంచి సమస్యలు పరిష్కరించేందుకు మార్గం సుగమం చేసుకునే వీలుంటుంది. సభ వేదికగా మాట్లాడితే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల్లోనూ ఆ ఎమ్మెల్యేకు సానుకూల ప్రభావం ఉంటుంది. అయితే ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీయాల్సిన తరుణంలో, పార్టీ వ్యూహాల కారణంగా సభను బహిష్కరించడమో లేక దూరంగా ఉండటమో జరుగుతోందని ఎమ్మెల్యేలు అంతర్గతంగా మదనపడుతున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాలతో సస్పెన్షన్ కు గురై వర్షాకాల సమావేశాలసెషన్ కు దూరమయ్యారు. నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే వేదిక అసెంబ్లీనే అయినప్పటికీ, దాన్ని ఉపయోగించుకోలేకపోవడం వల్ల తమ ఉనికికే ప్రశ్నార్థకం మారే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఎన్నికల్లో తమను గెలిపించిన ప్రజల వద్దకు ఏ మొహం పెట్టుకుని వెళ్లాలనే ప్రశ్న గులాబీ ఎమ్మెల్యేలను వేధిస్తోంది. ప్రతీసారి నియోజకవర్గంలోని అంశాలను ప్రస్తావించేవారు.ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ తరుణంలో నియోజకవర్గఅభివృద్ధి నిధులు రాకపోవడం, పనులకు మోక్షం కలగకపోవడం వంటి సమస్యలను ప్రజలకు ఎలా వివరించాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రభుత్వంపై నిరసన తెలపడానికి అసెంబ్లీ సరైన వేదిక కాగా, ఆ అవకాశాన్ని కోల్పోవడం వల్ల నియోజకవర్గంలో తమ పట్టు సడలిపోతుందనే భయం వారిలో నెలకొంది.
A;so read: 15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు, ప్రజలు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనే మీమాంస కొనసాగుతోంది. కేవలం పార్టీ అగ్రనేతల ఆదేశాలకు కట్టుబడి ఉంటే సరిపోదని, ప్రజాక్షేత్రంలో సొంత రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి అసెంబ్లీలో గళం వినిపించడం అత్యవసరమని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. పార్టీ నిర్ణయాలను దాటి బయటకు రాలేక, అలాగని మౌనంగా ఉంటే ప్రజల్లో దోషులుగా మిగిలిపోతామనే భయం గులాబీ శిబిరంలో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
సస్పెన్షన్ కు గురైంది ఈ నెల9న అసెంబ్లీకి హాజరైన వారు మాత్రమే. స్పీకర్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లుపేర్లను ప్రకటించారు. ఆ రోజూ సభకు హాజరుకాని వారిలో గంగుల కమలాకర్ ను సైతం సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే కేసీఆర్ తో పాటు మల్లారెడ్డి, పద్మారావు, మహిపాల్ రెడ్డి సభనుంచి సస్పెండ్ కాలేదు. అయితే వారు సైతం సభకు రాకపోవడంతో ఇప్పుడు చర్చకుదారితీసింది. కేసీఆర్ ఇప్పటికే మళ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన తర్వాతనే సభకు వస్తారని పార్టీ స్పష్టం చేసింది. మిగిలిన ఎమ్మెల్యే అయినా వచ్చి పార్టీ గళం, నియోజకవర్గ సమస్యలను వినిపించవచ్చుకదానే చర్చసైతం జరుగుతుంది. ఒకవేళ వారు హాజరైతే పార్టీ ఏమైనాచర్యలు తీసుకుంటుందా? పార్టీ లైన్ దాటినట్లు అవుతుందా? అనే డైలామాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
Also read; ఇప్పుడు క్రేజ్ తగ్గినా.. అప్పట్లో అదొక సంచలనం.. 80’s లో మ్యాగీ మేనియా చూసొద్దామా?