Food For Better Digestion: ఆధునిక జీవనశైలి, ఒత్తిడితో పాటు సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే..ప్రతి రోజు భోజనం తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తినడం లేదా కొన్ని అలవాట్లను పాటించడం ద్వారా జీర్ణ క్రియను మెరుగు పరచుకోవచ్చు. ఫలితంగా ఈ సమస్యలను చాలా వరకు తగ్గించుకోవచ్చు.
జీర్ణశక్తిని పెంచడానికి , పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి భోజనం తర్వాత తినాల్సిన కొన్ని రకాల ఆహార పదార్థాలు:
1. సోంపు:
భోజనం తర్వాత సోంపు తినే అలవాటు చాలా మందిలో ఉంటుది. దీనిలో ఉండే ‘అనెథోల్’ అనే సమ్మేళనం జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించి.. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అంతే కాకుండా ఇది నోటి దుర్వాసనను తొలగించడమే కాక, గ్యాస్, ఉబ్బరం తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. భోజనం తర్వాత ఒక టీస్పూన్ సోంపు గింజలను నమలడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
2. మజ్జిగ లేదా పెరుగు:
భోజనం చివర్లో ఒక గ్లాసు మజ్జిగ లేదా కొద్దిగా పెరుగు తీసుకోవడం జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ (ఉపయోగకరమైన బ్యాక్టీరియా) పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను సమతుల్యం చేసి, జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. ఇది కడుపులో మంటను తగ్గిస్తుంది. అంతే కాకుండా అసిడిటీ రాకుండా అడ్డుకుంటుంది. ఇది ఆహారంలోని పోషకాలు సమర్థవంతంగా శరీరానికి అందేలా చూస్తుంది.
3. తాజా అల్లం :
అల్లంలో జింజెరోల్స్ అనే క్రియాశీల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. భోజనం తర్వాత చిన్న అల్లం ముక్కను కొద్దిగా ఉప్పుతో కలిపి తినడం లేదా అల్లం టీ తాగడం వల్ల వికారం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. అల్లం జీర్ణకోశ కండరాల కదలికలను మెరుగు పరచడంలో సహాయ పడుతుంది.
4. బొప్పాయి:
భోజనం తర్వాత పండ్లు తినడం మంచిది కాదని కొందరు భావించినప్పటికీ.. బొప్పాయి మాత్రం దీనికి మినహాయింపు. బొప్పాయిలో పపైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ మాంసకృత్తులు సులభంగా విచ్ఛిన్నం కావడానికి అంతే కాకుండా జీర్ణమవడానికి సహాయ పడుతుంది. భోజనం తర్వాత కొన్ని బొప్పాయి ముక్కలు తినడం వల్ల అజీర్ణం సమస్య తగ్గుతుంది.
Also Read: గుండెకు విశ్రాంతి అవసరం అని తెలిపే.. సంకేతాలు !
5. లవంగాలు:
లవంగాలలో యూజినాల్ అనే సహజ రసాయనం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. భోజనం తర్వాత 1-2 లవంగాలను నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరిగి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ముఖ్యమైన చిట్కాలు:
నీరు తాగడంలో జాగ్రత్త: భోజనం చేసిన వెంటనే అధిక మొత్తంలో నీరు తాగకుండా ఉండటం మంచిది, ఎందుకంటే.. ఇది జీర్ణ ఎంజైమ్‌ల గాఢతను తగ్గిస్తుంది. భోజనం తర్వాత అరగంట లేదా గంట విరామం ఇచ్చి నీరు తాగాలి.
నడక: భోజనం తర్వాత కొంతసేపు నెమ్మదిగా నడవడం జీర్ణ క్రియకు సహాయ పడుతుంది.
విశ్రాంతి: భోజనం చేసిన వెంటనే నిద్ర పోవడం లేదా ఎక్కువగా పనులు చేయడం మానుకోవాలి.