Hand Dryer: పబ్లిక్ టాయిలెట్లలో, మాల్స్‌లో, ఆఫీసుల్లో చేతులు నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత తడి ఆరబెట్టుకోవడానికి హ్యాండ్ డ్రైయర్లను వాడడం ఒక అలవాటుగా మారింది. వీటిని చాలా మంది పేపర్ టవల్స్ కంటే పరిశుభ్రమైనవిగా, పర్యావరణహితమైనవిగా భావిస్తుంటారు. కానీ.. అనేక పరిశోధనలు, ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఈ హ్యాండ్ డ్రైయర్స్ నిజానికి మన చేతులకు మరింత ఎక్కువ బ్యాక్టీరియాను అంటించి.. అనారోగ్యాన్ని వ్యాప్తి చేసే సాధనాలుగా పనిచేస్తున్నాయని వెల్లడైంది.
క్రిముల వ్యాప్తికి కేంద్రాలు:
హ్యాండ్ డ్రైయర్ల గురించి బయట పడుతున్న అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఇవి వాష్ రూమ్ గాలిలో తిరుగుతున్న క్రిములను, బ్యాక్టీరియాను నేరుగా మన శుభ్రమైన చేతులపైకి విసిరివేస్తాయి. టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు గాలిలోకి వ్యాపించే సూక్ష్మ క్రిములు, వైరస్‌లు, ఫంగస్ స్పోర్స్ టాయిలెట్ గాలిలో ఉంటాయి.
గాలిని పీల్చి, విసిరివేస్తాయి: ఈ డ్రైయర్లు గాలిని ఫిల్టర్ చేయకుండా, వాష్‌రూమ్‌లోని అదే కలుషితమైన గాలిని లోపలికి పీల్చుకుని, వేగ వంతమైన ప్రవాహంతో (ముఖ్యంగా జెట్ డ్రైయర్లు) చేతుల పైకి పంపుతాయి.
వ్యాప్తి తీవ్రత: అధ్యయనాల ప్రకారం.. హై-స్పీడ్ జెట్ డ్రైయర్లు, పేపర్ టవల్స్ కంటే 1,300 రెట్లు ఎక్కువ క్రిములను గాలిలోకి వ్యాప్తి చేస్తాయి. ఈ క్రిములు చేతులపైకి చేరడమే కాకుండా.. దుస్తుల పైకి, చుట్టుపక్కల ఉపరితలాలపైకి, ఇతర వ్యక్తులపైకి కూడా వెళ్తాయి.
బ్యాక్టీరియా వృద్ధి: కొన్ని డ్రైయర్ల నుంచి వచ్చే వేడి గాలి బ్యాక్టీరియా వృద్ధిని 254 శాతం వరకు పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తడిగా ఉండే చేతులకు బ్యాక్టీరియా త్వరగా అంటుకునే ప్రమాదం ఉంది.
ఆరోగ్యపరమైన ప్రమాదాలు:
హ్యాండ్ డ్రైయర్ల వాడకం వల్ల కలిగే ప్రధాన అనారోగ్య సమస్యలు..
అంటువ్యాధులు: E.కోలి (E. coli), సాల్మొనెల్లా వంటి హాని కరమైన బ్యాక్టీరియా చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశించి, జ్వరాలు, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్‌లు మరియు ఇతర అంటువ్యాధులకు కారణమవుతాయి.
శ్వాసకోశ సమస్యలు: డ్రైయర్లలో పేరుకుపోయిన దుమ్ము, శిలీంధ్రాలు, సూక్ష్మ క్రిములు గాలిలోకి విడుదలైనప్పుడు, వాటిని పీల్చడం ద్వారా అలర్జీలు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తవచ్చు.
చర్మం పొడిబారడం: డ్రైయర్ల నుంచి వచ్చే వేడి గాలి చర్మంలోని సహజ తేమను తొలగిస్తుంది. దీనివల్ల చర్మం పొడిగా మారి, పగుళ్లు ఏర్పడతాయి.
Also Read: ఇలాంటి ఫుడ్ తింటే.. త్వరగా ముసలి వాళ్లవుతారట !
పరిష్కారం ఏమిటి ?
చేతులు కడుక్కున్న తర్వాత వాటిని పూర్తిగా ఆరబెట్టుకోవడం పరిశుభ్రతలో అత్యంత కీలకం. అయితే, హ్యాండ్ డ్రైయర్ల ద్వారా అనారోగ్యాలను కొని తెచ్చుకునే బదులు, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. పేపర్ టవల్స్ తేమను తీసుకోవడం ద్వారా క్రిములను తొలగిస్తాయి. అంతే కాకుండా వ్యాప్తిని తగ్గిస్తాయి. అందుకే.. ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాల్లో, వీలైనంత వరకు హ్యాండ్ డ్రైయర్లకు దూరంగా ఉండి, టిష్యూ పేపర్ (పేపర్ టవల్స్) వాడటం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు.