ఒకప్పుడు మహిళకు పెద్దగా ఒత్తిడి ఉండేది కాదు. ఇంట్లోనే వంటలకు, పిల్లలను పెంచేందుకు మాత్రమే పరిమితం అయ్యేవారు. ఇప్పుడు ఇంటి బాధ్యతలను మోస్తూ ఉద్యోగం చేస్తూ ఇంటి పనులను కూడా నిర్వర్తిస్తున్నారు. ఇవన్నీ కూడా వారిపై అధిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. అలాగే ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు కూడా వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. వ్యాధులు శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఉంటాయి. అందులో ముఖ్యమైనది డిప్రెషన్. పురుషులకంటే స్త్రీలే తీవ్ర ఒత్తిడికి గురై డిప్రషన్ బారిన పడుతున్నట్టు తెలుస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం డిప్రెషన్ ఎవరికైనా రావచ్చు. పురుషుల్లో స్త్రీలలో కూడా డిప్రెషన్ వస్తుంది. అయితే మగవారితో పోలిస్తే ఆడవారిలోనే డిప్రెషన్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆడవారికి ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల వారు డిప్రెషన్ బారిన పడుతున్నట్టు అధ్యయనం చెబుతోంది.
డిప్రెషన్ లక్షణాలు
డిప్రెషన్ కూడా కొన్ని లక్షణాలను సూచిస్తుంది. కానీ ఎంతోమంది ఆ లక్షణాలను విస్మరిస్తారు. ఎవరైనా ఆకస్మాత్తుగా విచారంగా మారడం లేదా నిత్యం విచారంగా ఉండడం ప్రారంభిస్తే అది డిప్రెషన్ సంకేతంగా భావించవచ్చు. అలాంటి వ్యక్తిని ఒంటరిగా వదిలేయకూడదు. వారితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. ఒక వ్యక్తి విపరీతమైన కోపంగా ఉండడం లేదా పూర్తిగా నిరాశక్తిగా ఉండడం కూడా డిప్రెషన్ లక్షణాలే. వారి మానసిక స్థితిలో మార్పులు వస్తేనే వారు ఇలా ప్రవర్తిస్తారు.
తరచూ చిరాకు పడడం అనేది కూడా డిప్రెషన్ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి విపరీతంగా చిరాకు పడుతూ అందరి మీద అరుస్తూ ఉంటే అతను వైద్య సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిప్రెషన్ వల్ల ఎదుటివారిపై చిన్న చిన్న తప్పులకి విపరీతమైన చిరాకు కలుగుతుంది. ఒక్కోసారి ఎదుటివారు ఏదీ చేయకపోయినా కూడా చిరాకుపడతారు.
డిప్రెషన్ వారిని పడిన వ్యక్తి ఎప్పుడూ ఖాళీగా కూర్చొంటాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతాడు. బయటకు కూడా వెళ్లడానికి ఇష్టపడడు. ఇలాంటి లక్షణాలు ఉంటే డిప్రెషన్ బారిన పడ్డారో లేదో చెక్ చేసుకోవడం మంచిది. డిప్రెషన్ బారిన పడితే ఒక వ్యక్తి నిద్ర పోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటాడు. అంటే అతిగా నిద్రపోతాడు. లేదా నిద్ర చాలా వరకు తగ్గిపోతుంది.
విపరీతంగా ఆకలిగా అనిపించడం లేదా ఆకలి పూర్తిగా తగ్గిపోవడం కూడా డిప్రెషన్ కు సంకేతంగానే చెప్పుకోవచ్చు. డిప్రెషన్ సమయంలో కొంతమందికి ఆకలి బాగా పెరుగుతుంది. దానివల్ల వారు బరువు కూడా పెరుగుతారు. కొంతమందికి ఆకలి చాలా వరకు తగ్గిపోతుంది. దీనివల్ల వారు చాలా సన్నగా తయారవుతారు.
డిప్రెషన్ వల్ల ఏ పనీ చేయాలనిపించదు. పనిచేయడానికి శక్తి లేనట్టుగా అనిపిస్తుంది. దేనిపైనా దృష్టి పెట్టలేదు. డిప్రెషన్ తీవ్రంగా మారితే ఆత్మహత్య ఆలోచనలు కూడా కలుగుతాయి. అలాంటి ఆలోచనలు కలిగితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.