Amazon layoffs: టెక్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తన కంపెనీలోని వివిధ విభాగాల్లో ఉద్యోగులను తగ్గించుకునేందుకు రెడీ అయ్యింది. 30 వేల మంది ఉద్యోగాలు తొలగించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు మేనేజర్లకు ఈ-మెయిల్స్ వెళ్లినట్టు తెలుస్తోంది. మంగళవారం నుంచి కోతలు మొదలయ్యాయి. ఉన్నట్లుండి ఉద్యోగాలు తొలగింపు కారణమేంటి? అసలేం జరుగుతోంది?
టెక్ కంపెనీలకు కోతల కాలం
అమెరికాలో ట్రంప్ నిర్ణయాలు చాలా కంపెనీలను పెనుశాపంగా మారాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు తమతమ ఉద్యోగులను తగ్గించుకునే పనిలోపడ్డాయి. భారీగా ఉద్యోగులను తొలగించేందుకు అమెజాన్ రెడీ అయ్యింది. దాదాపు 30 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అమెజాన్ కంపెనీలో సోమవారం వివిధ విభాగాల మేనేజర్లకు ఈ-మెయిల్స్ వెళ్లినట్టు తెలుస్తోంది. మంగళవారం నుంచి తొలగింపులు ప్రారంభం అయినట్టు సమాచారం. అమెజాన్‌లో ప్రస్తుతం 3.5 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. వారిలో 10 శాతం మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆ కంపెనీలో ఈ స్థాయిలో ఉద్యోగాలు తొలగించడం తొలిసారి.
అమెజాన్‌లో 30 వేల మందిపై వేటు?
ముఖ్యంగా పలు విభాగాల్లో కోతలు ఉండనున్నాయి. వాటిలో హెచ్ఆర్ విభాగం, ఆపరేషన్స్, డివైజెస్, సర్వీసులు, వెబ్ సర్వీసుల ఉద్యోగుల వంతు కానుంది. కేవలం హెచ్‌ఆర్ విభాగంలో ఈసారి 15 శాతం మంది తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. కరోనా సమయంలో భారీగా నియామకాలు చేపట్టిన ఆ కంపెనీ.. మారుతున్న పరిస్థితుల రీత్యా తొలగింపుకు సిద్ధమైంది.
ఆ కంపెనీలో మేనేజర్ల సంఖ్యను కుదించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఏఐ వినియోగం పెరిగిన కొద్దీ మరిన్ని తొలగింపులు ఉంటాయని ఇటీవల ఉద్యోగులకు ఆ కంపెనీ సంకేతాలు ఇచ్చినట్టు చెబుతున్నారు. పండుగ సీజన్‌లో రద్దీని దృష్టిలో పెట్టుకుని వేర్ హౌస్ కార్యకలాపాల కోసం తాత్కాలికంగా సిబ్బందిని నియమించుకోనుంది.
ALSO READ: అమెరికాలో భారీ పేలుడు.. 16 మంది దుర్మరణం
కరోనా సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ డిమాండ్ భారీగా పెరిగింది. ఈ క్రమంలో విపరీతంగా నియామకాలు చేపట్టింది ఆ కంపెనీ. ప్రపంచ వ్యాప్తంగా 1.54 మిలియన్లకు పైగా ఉద్యోగులు ఉన్నాయి. కేవలం కార్పొరేట్ విభాగంలో 3.5 లక్షల మంది పని చేస్తున్నారట. కరోనా తర్వాత ఆన్‌లైన్ డిమాండ్ తగ్గడం కారణంగా చెబుతున్నారు. దీనికితోడు గ్లోబల్ ఎకానమీ మందగమనం మొదలైంది. అధిక ఖర్చులు పెరగడంతో వ్యాపారంపై ఒత్తిడి పెరిగింది.
ఇప్పటికే అమెజాన్ పలు విభాగాల్లో ప్రాజెక్టులను నిలిపి వేసినట్టు మేనేజర్ స్థాయి అధికారుల మాట. ఎందుకంటే కంపెనీలు AI-ఆధారిత వైపు మొగ్గు చూపుతున్నాయి. ఏఐ, రోబోటిక్స్ పెరుగుదలతో భవిష్యత్తు వర్క్ ఫోర్స్ నిర్మాణం మారిపోనుంది. కేవలం అమెజాన్ మాత్రమే కాదు.. 200 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు, ఈ ఏడాది దాదాపు లక్ష మంది ఉద్యోగాలపై వేటు వేసినట్టు రిపోర్టులు చెబుతున్నాయి.