Gen Z Crash Out Trend| మీ ఫోన్ బ్యాటరీ అకస్మాత్తుగా అయిపోయిందా? ముఖ్యమైన సమయంలో ఇంటర్నెట్ పనిచేయడం ఆగిపోయిందా? లేదా ఫ్రెండ్స్ చివరి నిమిషంలో మీ ప్లాన్ రద్దు చేశారా? ఇలాంటి చిన్న సంఘటనలకే కొన్నిసార్లు విపరీతమైన కోపం వస్తుంది. అరవాలని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని లేదా అన్నీ వదిలేయాలని అనిపిస్తుంది. ఈ తరహా ఎమోష్నల్ రియాక్షన్‌కు జెన్ Z యువత ఉపయోగిస్తున్న కొత్త పదమే ‘Crash Out’. సోషల్ మీడియాలో ఈ పదం ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతోంది. అసలు దీని అర్థం ఏమిటి? ఎందుకు ఇంత పాపులర్ అయింది? తెలుసుకుందాం.
సాధారణంగా చెప్పాలంటే, కోపం, ఒత్తిడి లేదా నిరాశ కారణంగా మనపై మనకు నియంత్రణ కోల్పోవడాన్ని ‘Crash Out’ (క్రాష్ ఔట్) అంటారు. చిన్న సమస్యకే అతిగా స్పందించడం కూడా ఇందులోకి వస్తుంది. ఉదాహరణకు, ఆఫీసులో మీరు పని చేస్తున్నప్పుడు ఎవరైనా పదేపదే ఇబ్బంది పెడుతున్నారని అనుకుందాం. మొదట సహనంగా ఉన్నా, కొంతసేపటికి చిరాకు పెరుగుతుంది. చివరకు కోపంతో గట్టిగా మాట్లాడవచ్చు.
అలాగే, ఫ్రెండ్స్ అందరి ముందు మిమ్మల్ని అవమానిస్తే తీవ్రంగా బాధపడతారు. ఆ సమయంలో వచ్చే కోపాన్ని కూడా ఈ పదంతో వివరిస్తారు. కొందరు దీన్ని సరదాగా కూడా ఉపయోగిస్తున్నారు.
జెన్ Z యువత తమ రోజువారీ అనుభవాలను కొత్త పదాలతో వ్యక్తపరుస్తుంటారు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి పదాలు వేగంగా ప్రాచుర్యంలోకి వస్తాయి. ఉదాహరణకు, ముఖ్యమైన మీటింగ్‌కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నారు. కానీ డ్రైవర్ చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేశాడు. అప్పుడు వచ్చే చిరాకును ‘క్రాష్ ఔట్’ అంటూ సరదాగా చెప్తారు.
అలాగే, ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ ఆగిపోవడం లేదా స్నేహితులు ప్లాన్ రద్దు చేయడం కూడా ఇలాంటి సందర్భాలే. మీమ్స్, రీల్స్ ద్వారా యువత తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అందుకే ఈ పదం ఆన్‌లైన్ సంభాషణల్లో బాగా వినిపిస్తోంది.
కోపం రావడం సహజమైన భావోద్వేగం. ప్రతి సందర్భంలోనూ ప్రశాంతంగా ఉండటం సాధ్యం కాదు. అయితే, కోపం మన ప్రవర్తనను నియంత్రించడం మొదలుపెడితే సమస్యలు వస్తాయి. ఆ సమయంలో ఇతరులను బాధించే మాటలు చెప్పే అవకాశం ఉంది. తర్వాత పశ్చాత్తాపపడే నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. అందుకే కోపానికి కారణమైన విషయాన్ని గుర్తించడం ముఖ్యం.
Also Read: ఆఫీస్‌లో సహోద్యోగులతో స్నేహం మంచిదే.. కానీ ఈ విషయాలు మాత్రం వారికి చెప్పకూడదు
కోపాన్ని పూర్తిగా దాచుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఇతరులకు హాని కలగకుండా వ్యక్తపరచడం నేర్చుకోవాలి.
కొద్దిసేపు విరామం తీసుకోండి: కోపం తెప్పించే పరిస్థితి నుంచి కాస్త దూరంగా ఉండండి.
నెమ్మదిగా శ్వాస తీసుకోండి: లోతుగా శ్వాస పీల్చడం మనసు శాంతపడుతుంది.
మాట్లాడే ముందు ఆలోచించండి: ఆవేశంలో బాధపెట్టే మాటలు మాట్లాడకండి.
కోపానికి కారణం గుర్తించండి: మీకు ఎందుకు చిరాకు వచ్చిందో తెలుసుకోండి.
ప్రశాంతంగా మాట్లాడండి: అరవకుండా మీ భావాలను వివరించండి.
మొత్తానికి క్రాష్ ఔట్ అంటే జెన్ Z యువత.. కోపం, నిరాశ వంటి భావాలను వ్యక్తపరచడానికి ఉపయోగిస్తున్న ట్రెండింగ్ పదం. కోపం రావడం తప్పు కాదు. కానీ ఆ కోపాన్ని ఎలా నియంత్రిస్తున్నామన్నదే ముఖ్యం.
Also Read: విడాకుల రోజే రెండో పెళ్లి.. కోర్టు తీర్పురాక ముందే చెల్లుబాటు అవుతుందా?