V Hanumantha Rao: గాంధీ భవన్‌లో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత రావు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో దేవాదాయ భూముల కబ్జా నుంచి కేంద్ర రాజకీయాల వరకు పలు అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు.
దేవుడి భూములను వదలడం లేదు
‘నా పేరు హనుమంతుడు.. హనుమాన్ దేవుడికే అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు’ అంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్వాన్ హనుమాన్ ఆలయానికి చెందిన 4 ఎకరాలు, చేవెళ్ల బాలాజీ ఆలయానికి చెందిన 77 ఎకరాలు, అత్తాపూర్ పద్మనాభ ఆలయ 4 ఎకరాలు, టోలిచౌకి దగ్గర 3.20 ఎకరాలు, హుజూర్‌నగర్ సీతారామ ఆలయానికి చెందిన 44 ఎకరాల భూమిని కొందరు కబ్జా చేశారని ఆయన లెక్కలతో సహా వివరించారు. కలెక్టర్‌తో, అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ భూములను కాపాడుతానని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంపై విమర్శలు
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దేవుడి భూములను కూడా వదలకుండా కబ్జా చేశారని వీహెచ్ ఆరోపించారు. ధరణి పేరుతో ఇందిరా గాంధీ పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను గుంజుకునే ప్రయత్నం జరిగిందన్నారు. మూడేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న వాళ్లు.. గతంలో కబ్జా అయిన భూములను తమ ప్రభుత్వం కాపాడుతోందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కబ్జాకు గురైన భూములన్నింటినీ ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మోదీ, బీజేపీలపై ఫైర్
జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూ.. ప్రధాని మోదీ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఖతం చేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ ఓబీసీలకు న్యాయం చేయాలని కోరుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని, మోదీ మళ్లీ అధికారంలోకి రారని జోస్యం చెప్పారు. ఓబీసీలకు న్యాయం జరిగే వరకు కొట్లాడుతానని, అమిత్ షా తెలంగాణకు ఎప్పుడు వచ్చినా వినతిపత్రం ఇస్తానని తెలిపారు. రాహుల్ గాంధీతో రాష్ట్రంలో భారీ సభ పెడితే తాను 2 లక్షల మందిని సమీకరిస్తానని వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్ దంపతులు!