The Cycle on OTT: రాత్రిపూట లైట్లు ఆర్పేసి ఒంటరిగా హారర్ సినిమాలు చూడాలంటే మీకు ఇష్టమా? అయితే ఈ సినిమా మీ గుండె వేగాన్ని కచ్చితంగా పెంచుతుంది. సాధారణంగా దెయ్యాల సినిమాలంటే ఏదో పాత బంగ్లా లేదా ఆత్మల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ 36 ఏళ్ల క్రితమే చనిపోయి, సమాధి కాబడిన ఒక శవం ప్రతి పౌర్ణమికి ప్రాణం పోసుకుని రాక్షసుడిలా వేటాడితే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది కదూ. దిగ్గజ హారర్ రచయిత స్టీఫెన్ కింగ్ (Stephen King) ప్రశంసించిన అలాంటి సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘ది సైకిల్’ (The Cycle) ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను వణికిస్తోంది. మార్వెల్ ‘డేర్‌డెవిల్’ ఫేమ్ డెబోరా ఆన్ వోల్, జెఫ్రీ డోనోవన్ ప్రధాన పాత్రల్లో జోర్డాన్ డౌనీ తెరకెక్కించిన ఈ చిత్రం రొటెన్ టొమాటోస్‌లో ఏకంగా 96 శాతం స్కోర్ సాధించి సంచలనం సృష్టించింది. ఆ శవం వెనుక దాగి ఉన్న భయంకరమైన శాపం ఏంటో, ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.
ఈ సినిమా కథంతా డాక్టర్ మెగాన్ గార్లాండ్ (డెబోరా ఆన్ వోల్) అనే ఒక ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్ట్ చుట్టూ చాలా ఇంటెన్స్ గా సాగుతుంది. ఒకరోజు ఒక సముద్ర తీర ప్రాంతపు ఇంట్లో తల్లీకూతుళ్లు అత్యంత కిరాతకంగా, ఏదో క్రూరమృగం దాడి చేసినట్లుగా హత్యకు గురవుతారు. ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు, అక్కడ 36 ఏళ్ల క్రితం అదృశ్యమై చనిపోయిన మరో వ్యక్తి శవం కనిపించడం పెద్ద షాక్ ఇస్తుంది. విచారణలో ఆ మృతదేహం మరెవరిదో కాదు, 36 ఏళ్ల క్రితం తన కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయిన మెగాన్ తండ్రి పీటర్ స్టంప్ దేనని తేలుతుంది.
ఇక అక్కడి పోలీసు ఆఫీసర్ మార్క్స్ తో కలిసి మెగాన్ ఆ కేసును దర్యాప్తు చేయడం మొదలుపెడుతుంది. అయితే విచారణ సాగుతున్న కొద్దీ ఈ కేసు ఒక భయానకమైన అతీంద్రియ మలుపు తిరుగుతుంది. ఎందుకంటే తన తండ్రి శవానికి తోడేలు శాపం సోకిందని, 36 ఏళ్ల క్రితమే చనిపోయినప్పటికీ ఆ శవం ప్రతి పౌర్ణమి రాత్రి ఒక భయంకరమైన రాక్షసుడిగా (Werewolf) మారి చుట్టుపక్కల ఉన్న మనుషులను వేటాడుతోందనే సంచలన నిజం బయటపడుతుంది. ఆ శాపగ్రస్తమైన రాక్షసుడి బారి నుంచి మెగాన్ తనను తాను, ఆ ఊరి ప్రజలను ఎలా కాపాడుకుంది ? అనే విషయాలు మాత్రం వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటాయి.
ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో ప్రీమియర్ అయిన తర్వాత ‘ది సైకిల్’ (The Cycle) ఇటీవలే డిజిటల్ తెరపైకి వచ్చింది. IMDbలో 6.3/10 రేటింగ్ సాధించిన ఈ హారర్ థ్రిల్లర్ షడ్డర్ (Shudder), ఏఎంసీ ప్లస్ (AMC+), అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video Channels) ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రస్తుతం ఇంగ్లీష్ ఆడియోతో పాటు సబ్‌టైటిల్స్ సదుపాయంతో అందుబాటులో ఉంది. ‘ది థింగ్’, ‘సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్’ తరహా డార్క్, మిస్టరీ హారర్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి వీకెండ్‌లో ఇదొక పర్ఫెక్ట్ ఛాయిస్.
Read Also: ఒక్కరోజు పెరోల్, రెండు మిస్టరీ హత్యల కేసు… ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ థ్రిల్లర్