Toothache: చాలా మంది తరచుగా పంటి నొప్పి సమస్యతో ఇబ్బంది పడతారు. దీని వల్ల ఏ ఆహారం తీసుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. పంటి నొప్పి కారణంగా నిద్ర కూడా పట్టదు. మరికొందరిలో చల్లటి వస్తువులు తిన్నప్పుడు జివ్వుమంటుంది. ఈ సమస్య చాలా కాలం వరకు ఇబ్బంది పెడుతుంది. దీని నుంచి తప్పించుకోవడానికి తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పంటి నొప్పి ఎందుకు వస్తుంది..?
పంటి నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయని డెంటిస్ట్‌లు చెబుతున్నారు. కొన్ని సార్లు బ్యాక్టీరియా కారణంగా పంటిని రక్షించే ఎనామెల్ దెబ్బతినడం వల్ల క్యావిటీస్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరికొందరిలో చక్కెర ఎక్కువగా తినడం, పళ్లు సరిగ్గా తోమకపోవడం వల్ల కూడా పుచ్చు పళ్లు వచ్చే ఛాన్స్ ఉందట.
గమ్ వాపు, ఎర్రగా మారడం, రక్తం రావడాన్ని జింజివైటిస్ అని పిలుస్తారు. దీని వల్ల చిగుళ్ల నుంచి రక్తం వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో గమ్ లోపల వచ్చే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా దంతాలను తొలగించే అవకాశం ఉందట.
గట్టిగా ఉండే ఆహారం తినడం లేదా పంటి మీద ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల పన్నుపై పగుళ్లు వచ్చే ప్రమాదం ఉందని డెంటిస్ట్‌లు చెబుతున్నారు. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి వేడి, చల్లటి లేదా తీపి ఆహారం తిన్నప్పుడు నొప్పి వస్తుంది.
ALSO READ: స్కిన్ అలర్జీకి కారణాలేంటి..?
సెన్సిటివిటీ కారణంగా ఎక్కువ మందిలో పంటి నొప్పి సమస్యలు ఇబ్బంది పెడతాయి. చిగుళ్లు దెబ్బతినడం లేదా, ఎనామెల్ అరిగిపోయినప్పుడు సెన్సిటివిటీ వస్తుందట. కొన్ని సార్లు బ్రేసెస్ వంటివి కూడా దంతాలపై చెడు ప్రభావం చూపే ఛాన్స్ ఉందట. సైనస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారిలో తరచుగా దంత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
పంటి నొప్పి రావొద్దంటే ఏం చేయాలి..?
పంటి నొప్పి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలని డెంటిస్ట్‌లు సూచిస్తున్నారు. రోజుకు రెండు సార్లు ఫ్లోరైడ్ పేస్ట్‌తో దంతాలను క్లీన్ చేసుకుంటే క్యావిటీస్ సమస్యలు దరిచేరవని వైద్య నిపుణులు చెబుతున్నారు. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల పళ్లు పుచ్చిపోయే ప్రమాదం అధికంగా ఉంటుందట. ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి చక్కెరను మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కాల్షియం, మ్యాగ్నీషియం, సల్ఫర్ వంటి ఖనిజాలు దంతాలను రక్షించేందుకు సహాయపడతాయి. పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, ధాన్యాలు, బ్రోకలి, కాలీఫ్లవర్, క్యాబేజీలో ఈ ఖనిజాలు అధికంగా ఉంటాయి. అందుకే ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో వీటిని తప్పకుండా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.