Raw Food: ప్రకృతి ద్వారా లభించే ప్రతి ఆహారం పచ్చిగా ఉన్నప్పుడే ఎక్కువ పోషకాలను ఇస్తుందని చాలామంది భావిస్తారు. సలాడ్ల రూపంలో కొన్ని కూరగాయలు తినడం మంచిదే కానీ.. అన్ని పదార్థాలకూ ఇది వర్తించదు. కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగానే హానికరమైన బ్యాక్టీరియా, ఎంజైమ్ నిరోధకాలు లేదా విషపూరిత సమ్మేళనాలు ఉంటాయి. వీటిని సరైన ఉష్ణోగ్రత వద్ద వండటం ద్వారా మాత్రమే ఆ హానికారకాలను తొలగించవచ్చు. వండకుండా తినడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్లు లేదా దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే వండకుండా తినాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పొరపాటున కూడా పచ్చిగా తినకూడని ఆహారాలు:
1. చికెన్, మాంసం: పచ్చి మాంసంలో సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిని కనీసం 75∘C వరకు ఉడికించకపోతే.. ఇవి తీవ్రమైన విరేచనాలు, జ్వరం , పొట్ట సంబంధిత ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. పచ్చి మాంసం తాకిన చేతులతో ఇతర పదార్థాలను ముట్టుకోవడం కూడా ప్రమాదకరమే.
2. కిడ్నీ బీన్స్ : రాజ్మా లేదా కిడ్నీ బీన్స్‌లో ‘ఫైటోహెమాగ్లుటినిన్’ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది ఒక రకమైన టాక్సిన్. కేవలం నాలుగు లేదా ఐదు పచ్చి గింజలు తిన్నా సరే వికారం, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. వీటిని రాత్రంతా నానబెట్టి, బాగా ఉడికిస్తేనే ఆ విష పదార్థం నశిస్తుంది.
3. బంగాళదుంపలు : పచ్చి బంగాళదుంపల్లో ‘సోలనిన్’ అనే గ్లైకోఅల్కలాయిడ్ ఉంటుంది. ముఖ్యంగా ఆకుపచ్చగా మారిన లేదా మొలకలు వచ్చిన దుంపలు తింటే తలనొప్పి, అలసట, జీర్ణ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా, పచ్చి బంగాళదుంపల్లో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ వల్ల గ్యాస్ , కడుపు ఉబ్బరం అధికమవుతుంది.
4. గుడ్లు : చాలా మంది కండరాలు పెంచడానికి పచ్చి గుడ్లు తాగుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. అలాగే.. పచ్చి గుడ్డులోని తెల్లసొనలో ఉండే ‘అవిడిన్’ అనే ప్రోటీన్, మన శరీరం బయోటిన్ గ్రహించకుండా అడ్డుకుంటుంది. ఉడికించిన గుడ్డు ద్వారానే పూర్తి పోషకాలు అందుతాయి.
Also Read: తీపి తినకపోయినా షుగర్ పెరుగుతోందా? అయితే ఇవే కారణం కావచ్చు
5. పచ్చి పాలు: పాశ్చరైజ్ చేయని పాలలో ఈ-కోలి, లిస్టెరియా వంటి ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, ముఖ్యంగా పిల్లలకు, గర్భిణీలకు ప్రాణాంతకం కావచ్చు. పాలను ఎల్లప్పుడూ మరిగించి తాగడమే సురక్షితం.
6. క్యాసవా: కర్రపెండలం వేర్లలో ‘సైనోజెనిక్ గ్లైకోసైడ్స్’ ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్ళినప్పుడు ‘సైనైడ్’గా మారతాయి. వీటిని సరిగ్గా శుభ్రం చేసి, బాగా ఉడికించకపోతే ప్రాణాపాయం కలుగుతుంది.
ఆహారం వండటం అనేది కేవలం రుచి కోసం మాత్రమే కాదు, అది ఒక రక్షణ కవచం కూడా. ఉష్ణోగ్రత సహాయంతో ఆహారంలోని విషపూరితమైన క్రిములను చంపడం ద్వారా మనం సురక్షితంగా ఉండవచ్చు. కాబట్టి.. సలాడ్లు తినేటప్పుడు కూడా అవి పచ్చిగా తినడానికి అర్హమైనవో కాదో ఒకసారి సరిచూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార భద్రతా నియమాలను పాటించడం తప్పనిసరి.