Feet: మనం సాధారణంగా ముఖం లేదా గుండె ఆరోగ్యంపై చూపించే శ్రద్ధ కాళ్ళపై చూపము. కానీ.. రక్త ప్రసరణ సమస్యల నుంచి డయాబెటిస్ వరకు అనేక అంతర్గత వ్యాధుల లక్షణాలు మొదట మన పాదాలలోనే కనిపిస్తాయి. మన శరీరంలో గుండెకు అత్యంత దూరంగా ఉండే భాగం పాదాలు కావడం వల్ల, రక్త ప్రసరణలో లేదా నరాల పనితీరులో చిన్న మార్పు వచ్చినా అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మీ కాళ్ళు, పాదాలలో వచ్చే కొన్ని మార్పులు మీ శరీరంలో దాగి ఉన్న ఏయే ఆరోగ్య సమస్యలను సూచిస్తాయో వివరంగా తెలుసుకుందాం.
1. పాదాల వాపు:
పాదాలు లేదా చీలమండల వద్ద వాపు రావడం అనేది గుండె, కిడ్నీలు లేదా కాలేయ సమస్యలకు సంకేతం కావచ్చు. గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయలేనప్పుడు.. గురుత్వాకర్షణ వల్ల ద్రవాలు కాళ్ళలో పేరుకుపోతాయి (దీనిని ఎడెమా అంటారు). అలాగే.. కిడ్నీలు వ్యర్థాలను సరిగ్గా వడపోయలేకపోయినా పాదాలలో వాపు కనిపిస్తుంది. ఒకవేళ వాపుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
2. నిరంతరం పాదాలు చల్లగా ఉండటం:
వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ మీ పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటే.. అది ‘పూర్ బ్లడ్ సర్క్యులేషన్’ లేదా థైరాయిడ్ సమస్యకు సంకేతం. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగనప్పుడు.. చివరన ఉండే పాదాలకు తగినంత రక్తం అందక చల్లబడతాయి. అలాగే థైరాయిడ్ గ్రంథి మందగించినప్పుడు కూడా శరీర ఉష్ణోగ్రత పడిపోయి పాదాలు చల్లగా మారుతాయి.
3. పాదాలలో తిమ్మిర్లు లేదా స్పర్శ లేకపోవడం:
కాళ్ళలో చీమలు పాకినట్లు అనిపించడం లేదా అస్సలు స్పర్శ లేకపోవడం అనేది ‘డయాబెటిక్ న్యూరోపతీ’కి ప్రాథమిక లక్షణం. రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉంటే.. అవి పాదాలకు వెళ్లే నరాలను దెబ్బతీస్తాయి. దీని వల్ల పాదాలకు చిన్న దెబ్బ తగిలినా లేదా పుండు పడినా నొప్పి తెలియదు. ఇది చివరకు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
4. పాదాలపై వెంట్రుకలు రాలిపోవడం :
చాలా మంది గమనించని విషయం ఏమిటంటే.. పాదాల వేళ్లపై ఉన్న వెంట్రుకలు అకస్మాత్తుగా రాలిపోవడం. ఇది ‘పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్’ కు సంకేతం కావచ్చు. రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం వల్ల పాదాలకు రక్త ప్రసరణ తగ్గినప్పుడు.. అక్కడి వెంట్రుకల కుదుళ్లకు పోషణ అందక రాలిపోతాయి. అలాగే చర్మం పల్చగా, మెరుస్తూ కనిపించడం కూడా దీని లక్షణమే.
Also Read: పొట్ట అనారోగ్యంగా ఉందా ? ఈ లక్షణాలను గుర్తించండి
5. పాదాల నొప్పి, పగుళ్లు:
కారణం లేకుండా నిరంతరం పాదాల నొప్పులు రావడం వల్ల విటమిన్ డి లేదా కాల్షియం లోపం ఉందని అర్థం చేసుకోవచ్చు. అలాగే… మొండిగా మారిన మడమల పగుళ్లు కేవలం పొడి చర్మం వల్లే కాకుండా.. థైరాయిడ్ సమస్యలు లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా రావచ్చు. పాదాల గోళ్లు పాలిపోవడం లేదా పసుపు రంగులోకి మారడం అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా శ్వాసకోశ సమస్యలను సూచిస్తుంది.
మీ పాదాలు చేసే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకండి. రోజువారీ స్నానం చేసే సమయంలో మీ పాదాల రంగు, ఉష్ణోగ్రత, చర్మంలో వచ్చే మార్పులను గమనిస్తూ ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా నడక, సరైన చెప్పులు ధరించడం ద్వారా మీ పాదాలను , ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.