Adarsha Kutumbam:ఆదర్శ కుటుంబం’ ..వెంకీ మామ, త్రివిక్రమ్ కాంబోలో రానున్న ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది మూవీ టీమ్. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెంకీ మామ ఇచ్చిన స్పీచ్ అభిమానులని ఫిదా చేసేసింది.
సుమారు 25 ఏళ్ల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి మళ్లీ పనిచేయడం తనకు చాలా ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయో చెప్పక్కర్లేదు.ఇక ఈసారి కూడా ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌తో త్రివిక్రమ్ ముందుకు రావడంతో తనకు చాలా సంతోషంగా అనిపించిందని తెలిపాడు.
సాధారణంగా కుటుంబ కథా చిత్రాల్లో కామెడీ, భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని, అయితే ఈ ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో వాటితో పాటు థ్రిల్, సస్పెన్స్ వంటి ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా ఉన్నాయన్నాడు. అన్ని ఎలిమెంట్స్ కలగలిసిన ఈ కథ ప్రేక్షకులకు నచ్చి తీరుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు.ఇక ఈ సందర్భంగా తాను చేసిన ‘రాజా’, ‘సూర్యవంశం’, ‘వసంతం’, ‘ప్రేమించుకుందాం రా’, ‘కలిసుందాం రా’ వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని గుర్తు చేసుకున్నాడు వెంకీ.
అయితే ఈ సినిమా వాటన్నింటికంటే చాలా ప్రత్యేకమైనదని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, కుటుంబ సభ్యులతోనే కలిసి ఉండాలనే మంచి మెసేజ్ ఇందులో ఉంటుందని వివరించాడు వెంకటేష్.అటు స్టేడియం లో నితీష్ ,తిలక్ ,వైభవ్ లు సిక్సర్స్ కొడుతున్నారని,ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సిక్సర్లు కొట్టి పెద్ద విజయాన్నిఅందుకుంటుందని చెప్పాడు.
ఇక ఈ ఈవెంట్ లో వెంకటేష్ వ్యక్తిత్వం గురించి దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు కూడా హైలెట్ గా నిలిచాయి. వెంకటేష్‌లో ఉండే పాజిటివ్ ఎనర్జీ, ఏ విషయాన్నైనా తేలికగా తీసుకునే స్వభావం ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయాలని చెప్పాడు . మనం మన పని శ్రద్ధగా చేయాలి, ఫలితం గురించి ఎక్కువ ఆలోచించకూడదు అనే భావనను వెంకటేష్ తన నిజ జీవితంలో పాటిస్తారని, ఆయనలోని ఈ ఎనర్జీ తనకు ఎంతగానో నచ్చుతుందని త్రివిక్రమ్ వెంకీని ఆకాశానికి ఎత్తేశాడు.
ఇక వెంకటేష్ తన స్పీచ్ లో ఈ సినిమాలో నటించిన నటీనటులకు, కష్టపడి పనిచేసిన సాంకేతిక బృందానికి, నిర్మాతలు వంశీ, చిన్నబాబులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతాన్ని సినిమాని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేస్తాయని మెచ్చుకున్నాడు.అలాగే తక్కువ సమయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చి, ఓపికగా కూర్చుని తన మాటలు విన్న అభిమానులందరికీ వెంకటేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు వెంకీ.
తన సినిమాలను ఎప్పుడూ ఆదరించే కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలని కోరారు.ఇక చివరగా ప్రతీరోజూ ఉదయం లేచిన తర్వాత అందరూ సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని, జీవితంలో మిగతా విషయాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మన మనశ్శాంతి, సంతోషమే ముఖ్యమని చెప్పడం ఈవెంట్ కి హైలెట్ గా నిలిచింది. చూడాలి మరి ఈ నెల 30న ఈ ఫ్యామిలీ ఎలాంటి న్యూస్ చెప్పబోతుందో !
ALSO READ :సుధీర్ సింగిల్ లైఫ్‌పై సత్తి సెటైర్లు.. దివ్యభారతి ముందు పరువు తీసేశాడుగా!