Mookuthi Amman 2:లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) అమ్మవారి గెటప్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్’. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరిట విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. పైగా డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వంలో అనౌన్స్ చేయడంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూడగా.. తాజాగా వినాయక చవితి సందర్భంగా ‘రైజ్ ఆఫ్ మహాశక్తి’ పేరుతో టీజర్ ను విడుదల చేశారు. మొదటి భాగానికి పూర్తి భిన్నంగా మరింత స్థాయిలో పౌరాణిక, యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు కొంచెం హారర్ కూడా తగిలించి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తాజాగా విడుదల చేసిన టీజర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా టీజర్ మొదట్లోనే ప్రేక్షకులను మరో కాలానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మేకర్స్.
పురాతన రాజ్యం , శత్రువుల దాడితో అల్లకల్లోలం గా మారడం , ప్రజలు ప్రాణాల కోసం పోరాడటం వంటి సన్నివేశాలతో కథకు భారీ నేపథ్యాన్ని తీసుకొచ్చారు. మహారాణి తన కొడుకును శత్రువుల నుండి కాపాడమని దేవతను కోరుతూ ఏకంగా ప్రాణాలు అర్పిస్తుంది. దీంతో కథ ఒక్కసారిగా ప్రజెంట్ కాలానికి మారుతుంది. ఇప్పటి ప్రపంచంలో కూడా ఏదో అర్థం కాని విపత్తు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు టీజర్ లో చూపించారు. భయం , గందరగోళం సమయంలో ప్రజలు తమను కాపాడే దైవ శక్తి కోసం ఎదురుచూస్తున్నట్లు సన్నివేశాలు డిజైన్ చేశారు. ఇందులో ఊర్వశి మళ్ళీ కీలకపాత్ర పోషిస్తుంది.
ఇకపోతే ఒక బాలుడు శివలింగాన్ని ముట్టుకోగానే సడన్గా నయనతార అమ్మవారి అవతారంలో కనిపించారు. చేతిలో ఆయుధం శక్తివంతమైన రూపంలో కనిపించే ఆమె పాత్ర భక్తి కోణానికే పరిమితం కాకుండా భారీ సంఘర్షణకు కేంద్రంగా ఉండబోతున్నట్లు టీజర్ తో చూపించేశారు. మొత్తానికి అయితే మొదటి భాగానికి పూర్తి భిన్నంగా రాబోతున్న ఈ సినిమా ఊహించని విజయం అందుకుంటుంది అంటూ అప్పుడే అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ‘ఉపేంద్ర’ మూవీ!
ఇకపోతే మొదటి భాగానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా.. సీక్వెల్ బాధ్యతలను ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుందర్ సి తీసుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో నయనతార తో పాటు రెజీనా కసాండ్రా, ఊర్వశి , దునియా విజయ్, యోగి బాబు, అభినయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఐశరీ.కే. గణేష్ నిర్మిస్తుండగా హిప్ హాప్ తమిళా సంగీతం అందిస్తున్నారు . దీపావళి సందర్భంగా తీసుకురాబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించగా ..ఇప్పుడు రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు . 2026 నవంబర్ 6వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మొత్తానికైతే మొదటి భాగానికి కొనసాగింపుగా మాత్రమే కాకుండా మరింత భారీ విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార మహాశక్తిగా ప్రేక్షకులను మరోసారి అలరించడానికి సిద్ధమైందని చెప్పవచ్చు.