Online shopping scams: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ షాపింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇంటికే డెలివరీ, ఈజీ రిటర్న్స్ , భారీ డిస్కౌంట్లు ఉండడంతో జనం క్షణాల్లో కావాల్సిన ఆర్డర్లు పెట్టేస్తున్నారు. అయితే ఇదే.. అదనుగా సైబర్ కేటుగాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు. బ్రాండెడ్ వస్తువులు సగం ధరకే వస్తున్నాయని, లేదా 99 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ఇస్తామని ఆకర్షణీయమైన ప్రకటనలు కూడా ఇస్తున్నారు. ఫేక్ లింక్స్‌తో అసలైన ఈ-కామర్స్ సైట్ల లాంటి నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే అంశాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని కీలక విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో కనిపించే స్పాన్సర్డ్ యాడ్స్ ద్వారా.. ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఫేమస్ బ్రాండ్ల సేల్స్ పేరుతో.. భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ.. లింక్స్ షేర్ చేస్తుంటారు. ఆ లింక్ క్లిక్ చేయగానే అచ్చం ఒరిజినల్ వెబ్ సైట్ లాంటిదే కనిపిస్తుంది. యూజర్లు నమ్మి తమ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయగానే.. క్షణాల్లోనే అకౌంట్‌లోని డబ్బులన్నీ మాయం అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఆర్డర్ చేసిన బ్రాండెడ్ ఐటెమ్‌కు బదులుగా తక్కువ క్వాలిటీ గల డూప్లికేట్ వస్తువులు లేదా పాత చెత్తను డెలివరీ చేసి చేతులు దులుపు కుంటారు.
అధికారిక యాప్‌లను మాత్రమే వాడండి: ఏదైనా ప్రొడక్ట్ కొనాలంటే.. నేరుగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లేదా ఆయా కంపెనీల అఫీషియల్ యాప్‌లను లేదా వెబ్ సైట్లను మాత్రమే ఉపయోగించండి. సోషల్ మీడియాలో.. వచ్చే గుర్తు తెలియని లింక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు. అలా చేస్తే క్షణాల్లోనే మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. అంతే కాకుండా అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అవుతాయి.
కళ్లెం వేయలేని ఆఫర్లు: మార్కెట్ ధర తో పోలిస్తే.. ఎక్కడైనా వస్తువు 80 నుంచి 90 శాతం తక్కువ ధరకు వస్తోందంటే అది వంద శాతం మోసమని గ్రహించాలి. ఏ కంపెనీ కూడా నష్టానికి వస్తువులను అమ్మదు.
Also Read: నెక్స్ట్ లెవెల్ ఆడియో వైబ్స్..అమెజాన్‌లో హాట్ కేకులా అమ్ముడవుతున్న ఇయర్‌బడ్స్
పేమెంట్ పద్ధతులు: కొత్త లేదా అనుమానాస్పద వెబ్ సైట్లలో ముందుగా ఆన్‌లైన్ పేమెంట్ లేదా యూపీఐ చెల్లింపులు చేయకండి. వీలైతే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోవడం బెస్ట్.
యూఆర్ఎల్ చెక్ : వెబ్‌సైట్ అడ్రస్‌లో ‘https:// ఉందా లేదా, స్పెల్లింగ్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.
ఆఫర్లకు కక్కుర్తిపడి మీ కష్ట పడి సంపాదించిన డబ్బును సైబర్ నేర గాళ్ల పాలు చేయకండి. ఏ చిన్న అనుమానం వచ్చినా ఆన్ లైన్ షాపింగ్ దూరంగా ఉండటమే మంచిది. అప్రమత్తతే మనకు శ్రీ రామ రక్ష!