Upendra Movie Re release: కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర దర్శకత్వం వహించి నటించిన ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ ‘ఉపేంద్ర’ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. 1999లో విడుదలైన ఈ సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనమే సృష్టించింది. రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో, ఉపేంద్ర పుట్టినరోజు కానుకగా ఈ మైండ్ బ్లాకింగ్ చిత్రాన్ని ఎంజీ మూవీస్ బ్యానర్‌పై ఎం. అచ్చిబాబు సెప్టెంబర్ 18న గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
‘ఎ’ సినిమాతో సగటు సినిమా ప్రేమికుడిని తనవైపు తిప్పుకున్న ఉపేంద్ర, ఆ తర్వాత తన సొంత పేరుతో తీసిన ‘ఉపేంద్ర’తో సినీ జగత్తును షేక్ చేశారు. ఇక మనుషుల సైకాలజీ, స్వార్థం మరియు సమాజపు తీరును ఎంతో విభిన్నమైన కథనంతో తెరకెక్కించి అందరినీ ఫిదా చేశారు.
ఈ సినిమాలో రవీనా టాండన్, ప్రేమ, దామిని కీలక పాత్రల్లో నటించారు. ఈ మూడు పాత్రలు మూడు భిన్నమైన కాలాలను రిప్రజెంట్ చేయడం విశేషం. ఇక ఈ టైటిల్‌లో ‘యు’ అంటే ఉపేంద్ర, ‘పి’ అంటే ప్రేమ, ‘డి’ అంటే దామిని, ‘ఆర్.ఎ.’ అంటే రవీనా అని దర్శకుడు ఉపేంద్ర అప్పట్లో ఆసక్తికరమైన అబ్రివేషన్ ఇచ్చారు.
కథ, మాటలు, పాటలు ఉపేంద్ర స్వయంగా రాయగా గురుకిరణ్ అందించిన స్వరాలు ట్రెండ్ సెట్ చేశాయి. ఇక 30వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైన ఈ సినిమా ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును, ఉపేంద్ర ఉత్తమ దర్శకుడిగా అవార్డును గెలుచుకున్నారు.
అప్పట్లో అంబికా కృష్ణ ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఉపేంద్ర విభిన్నమైన మేకింగ్ స్టైల్‌కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అందుకే 2015లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఉప్పి 2’ కూడా వచ్చింది.
ALSO READ: జబర్దస్త్ రోహిణి డిమాండ్ మామూలుగా లేదుగా.. ఒక్క నెల సంపాదన ఎంతంటే?
దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఈ కల్ట్ క్లాసిక్ సినిమా మళ్లీ బిగ్ స్క్రీన్‌పై అలరించబోతోంది. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్‌లలో బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఇక కొత్త తరం ప్రేక్షకులకు ఇది ఖచ్చితంగా ఒక సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
తెలుగు, కన్నడ సినీ ప్రేమికులకు ‘ఉపేంద్ర’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అదొక సంచలనం. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు సరికొత్త అనుభూతిని పొందేందుకు సెప్టెంబర్ 18న థియేటర్లకు వెళ్లి ఈ మైండ్ బెండింగ్ క్లాసిక్‌ను మరోసారి మిస్ కాకుండా చూసేయండి.