Allu Arjun Court: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నేడు (సోమవారం) నాంపల్లి కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ రోజు నిందితులంతా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలంటూ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం హీరో అల్లు అర్జున్ నేడు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావడం లేదని తెలుస్తోంది.
ఈ కేసులో ఏ11 (A11) నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్, నేడు కోర్టుకు వచ్చే అవకాశం లేదని ఆయన న్యాయవాద వర్గాల నుంచి సమాచారం అందుతోంది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ బన్నీ తరపు లాయర్ నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ తరపున ఆయన లాయరే నేడు కోర్టుకు హాజరై వాదనలు వినిపించనున్నారు. దీంతో అల్లు అర్జున్ వస్తారా రారా అనే ఉత్కంఠకు తెరపడినట్లయింది.
‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సమయంలో అభిమానులు భారీగా తరలిరావడంతో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపిన చిక్కడపల్లి పోలీసులు ఇటీవల కోర్టులో సుదీర్ఘ చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులు, భద్రతా సిబ్బందిని A1 నుంచి A10 నిందితులుగా పేర్కొన్నారు. సరైన ముందస్తు సమాచారం, పోలీసుల అనుమతి లేకుండానే అల్లు అర్జున్ ఈవెంట్‌కు రావడం వల్లే అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారని, తద్వారానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొంటూ ఆయన్ను 11వ నిందితుడిగా (A11) చేర్చారు.
న్యాయస్థానం ఆదేశాల ప్రకారం నిందితులంతా వ్యక్తిగతంగా హాజరైతేనే ఈ రోజు నుంచి కేసు ట్రయల్స్ అధికారికంగా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ తరపు లాయర్ మినహాయింపు పిటిషన్ వేస్తుండటంతో, దీనిపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోర్టు ఈ పిటిషన్‌ను అంగీకరిస్తుందా? లేదా తదుపరి విచారణకు ఖచ్చితంగా హాజరుకావాలని ఆదేశిస్తుందా అనేది చూడాలి.