Bahubali The Epic: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సినిమాలలో బాహుబలి(Bahubali) సినిమా ఒకటి. అప్పటివరకు తెలుగు సినిమాలు కేవలం తెలుగు భాషకు మాత్రమే పరిమితమయ్యాయి కానీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సరికొత్త ట్రెండ్ సృష్టించడమే కాకుండా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవుతూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే..
ఈ క్రమంలోనే బాహుబలి సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ రెండు భాగాలను కలిపి ఒకే భాగంగా రాజమౌళి(Rajamouli) ప్రేక్షకుల ముందుకు తిరిగి బాహుబలి ది ఎపిక్(Bahubali The Epic) పేరిట విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda)తెలియజేస్తూ వచ్చారు. ఇలా రెండు సినిమాలు కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా రన్ టైం విషయంలో ప్రేక్షకులు కూడా అయోమయంలో పడ్డారు. తాజాగా రన్ టైం గురించి నిర్మాత శోభు యార్లగడ్డ క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. బాహుబలి ది ఎపిక్ సినిమాని 3 గంటల 40 నిమిషాల నిడివితో విడుదల చేయాలని భావించినట్లు వెల్లడించారు. ఎపిక్ సినిమా మొదటి భాగంలో “బాహుబలి: ది బిగినింగ్” ఉంటుందని, ఇది ముగిసిన తరువాత ఇంటర్వెల్, ఆ తరువాత “బాహుబలి: ది కంక్లూజన్” ప్రసారమయ్యేలా రాజమౌళి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అయితే ఇలా రెండు సినిమాలు కలిపి ఒకేసారి వస్తున్న నేపథ్యంలో రన్ టైం కూడా కాస్త ఎక్కువగానే ఉందని తెలుస్తోంది.
అందుకే బాహుబలి రీ రిలీజ్..
ఈ విధంగా ఈ సినిమాకు 3:40 నిమిషాల రన్ టైం అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. ఈ రన్ టైమ్ తెలిసిన కొంతమంది ఇంతసేపు థియేటర్లలో ప్రేక్షకులు కూర్చుని సినిమా చూడటం అంటే కష్టమే జక్కన్న అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఎండ్ టైటిల్స్ లో బాహుబలి 3 గురించి ప్రకటన ఉంటుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఈ వార్తలను నిర్మాత ఖండించారు. బాహుబలి 3 గురించి ప్రకటన ఉండదు కానీ ఒక సర్ప్రైజ్ మాత్రం ఉంటుందని ఈయన తెలియజేశారు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటా? అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బాహుబలి ది ఎపిక్ సినిమాని ఇప్పుడు విడుదల చేయడానికి కారణం లేకపోలేదని వెల్లడించారు. ఈ సినిమా విడుదలైన 10 సంవత్సరాల తర్వాత తిరిగి బాహుబలి సినిమాని కలెక్షన్ల కోసం విడుదల చేయడం లేదని, ప్రేక్షకులకు మరోసారి మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే విడుదల చేస్తున్నామని వెల్లడించారు.
Also Read: War 2 OTT: ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చేస్తున్న వార్ 2… ఎక్కడ చూడొచ్చంటే!