టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓటమెరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ముఖ్యంగా రాజమౌళి , సుకుమార్ లాంటి దిగ్గజ దర్శకుల జాబితాలో చేరిన ఈయన.. ఇప్పటివరకు 9 చిత్రాలు చేయగా ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకొని.. ఇప్పుడు మరో కొత్త కథతో వచ్చే ఏడాది సంక్రాంతికి రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో వచ్చే ఏడాది ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా ఈ వార్తలపై స్పందించి ఖండించారు.
అసలు విషయంలోకి వెళ్తే.. 2025 సంక్రాంతి సందర్భంగా విక్టరీ వెంకటేష్ తో కలసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేశారు. ఈ సినిమా ప్రాంతీయంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. వెంకటేష్ కెరియర్ లో 100 కోట్ల షేర్ వసూలు చేసి ఆయనకంటూ ఒక ఇమేజ్ ను అందించింది ఈ చిత్రం. అయితే అందులో భాగంగానే ఈ సినిమా సీక్వెల్ వచ్చే యేడాది రాబోతోంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అనిల్ రావిపూడి స్పందిస్తూ..” సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ తీసే ఆలోచన లేదు.. ఒకవేళ తీస్తే అది మాకు ప్లస్ అవ్వచ్చు లేదా శత్రువుగా మారొచ్చు.. అందుకే సంక్రాంతికి వస్తున్నాం సినిమా సీక్వెల్ తీసే ఆలోచన లేదు” అంటూ క్లారిటీ ఇచ్చారు.
అయితే ఇలాంటి సమయంలో భగవంత్ కేసరి సీక్వెల్ పై అనిల్ రావిపూడి స్పందించడంతో వెంకీ మామతో సీక్వెల్ చేయడానికి ఆసక్తి చూపని అనిల్ రావిపూడి ఇప్పుడు బాలయ్యతో సీక్వెల్ చేస్తారా? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. 2023లో బాలకృష్ణ (Balakrishna ) హీరోగా.. అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో బాలయ్య తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్తుంటే థియేటర్స్ మొత్తం ఊగిపోయాయి అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ సినిమా నేషనల్ అవార్డును కూడా అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేసే ఆలోచన ఉన్నట్టు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.
ALSO READ:Nithin – Ram: కొత్త సినిమా ప్రకటించిన నితిన్.. మరి రామ్ సంగతేంటి?
తాజాగా ఈ సంక్రాంతికి చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న అనిల్ రావిపూడి అందులో భగవంత్ కేసరి సినిమా సీక్వెల్ గురించి స్పందించారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. “భగవంత్ కేసరి సినిమా నా కెరియర్ లోనే చాలా స్పెషల్. అందులో బాలయ్య పాత్ర అద్భుతం . మా టీం కూడా ఈ సినిమాకు సీక్వెల్ కాదు కానీ ప్రీక్వెల్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. బాలకృష్ణ పోలీస్ పాత్ర పరిచయానికి ముందు ఏం జరిగి ఉంటుంది అని.. ఒక మంచి కథ అది. ఎందుకో ఆ ప్రీక్వెల్ పై ఆలోచన చేయలేదు. ఒకవేళ భవిష్యత్తులో ఛాన్స్ వస్తే ప్రీక్వెల్ చేయాలంటూ” చెప్పుకొచ్చారు.
ఇకపోతే నందమూరి అభిమానులు ఈ విషయం తెలిసి సంతోషం వ్యక్తం చేస్తుంటే .. వెంకీ అభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ పై ఎందుకు ఆలోచన చేయడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై అనిల్ రావిపూడి ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.