Toxic: కెజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఈ సినిమా తరువాత అన్ని భాషల్లో అతని గురించే చర్చ. ఒక సీరియల్ నటుడిగా కెరీర్ ను ప్రారంభించి.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారాడు. కెజిఎఫ్ రెండు భాగాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఈ సినిమాల తరువాత యష్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఎప్పుడెప్పుడు యష్ తదుపరి సినిమాను ప్రకటిస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు.
కెజిఎఫ్ లాంటి హిట్ తరువాత ఏ స్టార్ డైరెక్టర్ తో వస్తున్నాడు.. యష్ ఎలాంటి కథను ఎంచుకున్నాడు అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. వారి అంచనాలను తారుమారు చేస్తూ ఒక లేడీ డైరెక్టర్ తో ఈ హీరో జత కట్టాడు. మలయాళ స్టార్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ నటిస్తున్న చిత్రం టాక్సిక్. ఈ సినిమాను వెంకట్ కె, నారాయణ నిర్మిస్తున్నారు. గతేడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. అప్పటినుంచి ఇప్పటివరకు టాక్సిక్ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది.
మధ్యలో టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ ను తప్ప మేకర్స్ ఇంకేదీ రిలీజ్ చేయలేదు. అది కూడా అభిమానులను అంతగా అలరించలేకపోయింది. దీంతో టాక్సిక్ సినిమా గురించి అప్డేట్ అడిగేవారే లేకుండా పోయారు. యష్ ఫ్యాన్స్ తప్ప అంతగా ఈ సినిమా గురించి పట్టించుకున్నవారు కూడా లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇక సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకుంటున్నా టాక్సిక్ షూట్ ఇంకా పూర్తి కాలేదు. అందుకు కారణం డైరెక్టర్ అని వార్తలు వినిపిస్తున్నాయి.
అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ గీతూ మోహన్ దాస్.. టాక్సిక్ సినిమా నుంచి తప్పుకుంది అని టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు ఆమె తీసిన ఫుటేజ్ చూసి యష్ నిరాశపడినట్లు తెలుస్తోంది. అది నచ్చకపోవడంతో రీషూట్స్ మీద రీషూట్స్ చేస్తున్నారట. అయినా కూడా యష్ సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో సినిమా నుంచి ఆమె తప్పుకుందని, ఆమె ప్లేస్ ను కూడా యష్ నే తీసుకున్నాడని అంటున్నారు. మెగా ఫోన్ పట్టుకొని యష్ నే మిగిలిన సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడట. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఇదే నిజమైతే సినిమాపై అంచనాలు భారీగా తగ్గే అవకాశం మాత్రం ఉంది. మరి ఈ విషయమై మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.