HHVM 2: ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా మొదలైన విషయం తెలిసిందే. ఎప్పుడో 2021 లోనే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కరోనా వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీనికితోడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ. ఇలా పలు కారణాలవల్ల క్రిష్ జాగర్లమూడి సినిమా నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత ఏ.ఏం.రత్నం (AM Ratnam) కొడుకు, ప్రముఖ దర్శకుడు జ్యోతి కృష్ణ (Jyothi Krishna) ఈ సినిమా కథను తన చేతుల్లోకి తీసుకొని.. ఈ ఏడాది జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా , నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
వీరమల్లు 2 పై క్లారిటీ ఇచ్చిన క్రిష్..
ఇకపోతే ఈ సినిమా నుండి డైరెక్టర్ తప్పుకోవడం అటు ఉంచితే.. ఈ సినిమా కొంత భాగాన్ని డైరెక్టర్ క్రిష్ షూటింగ్ కూడా చేశారు. అయితే దానిని మొత్తం మార్చేశారని వార్తలు రాగా.. దీనిపై డైరెక్టర్ క్లారిటీ ఇస్తూ.. తాను షూటింగ్ చేసిన ఘట్టాన్ని పార్ట్-2 లో చూపించబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం అనుష్క (Anushka)తో కలిసి ‘ఘాటీ’ సినిమా చేస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ చేపట్టిన క్రిష్ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఘాటీ మూవీకి సంబంధించిన విశేషాలను పంచుకుంటూనే.. అటు హరిహర వీరమల్లు2 సినిమాపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆ 40 నిమిషాలు హైలైట్..
ప్రమోషన్స్ లో భాగంగా.. హరిహర వీరమల్లు సినిమా వచ్చేసింది కదా.. అది మీరు అనుకున్న స్క్రిప్టా లేక మార్చేసారా ? అని ప్రశ్నించగా.. క్రిష్ జాగర్లమూడి మాట్లాడుతూ.. “నేను షూటింగ్ చేసింది పూర్తిగా డిఫరెంట్.. స్క్రిప్ట్ మొత్తం ఢిల్లీ దర్బారులోనే ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఎత్తున సెట్ నిర్మించి.. ఎర్రకోటలో సుమారుగా 40 నిమిషాల షూటింగ్ ను చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ఏ.ఎం.రత్నం చాలా ఫ్యాషనేట్. ముఖ్యంగా అనుకున్న కథ పర్ఫెక్ట్ గా వచ్చేవరకు ఆయన వదలరు. అలా అన్నపూర్ణ స్టూడియోలో వేసిన కోట.. రాజమహల్ కి ఏమాత్రం తీసిపోదు.. అక్కడే మయూరి సింహాసనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తాజ్ మహల్ తో పాటు పెద్ద పెద్ద సెట్లు వేశారు.
ఆ సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి..
తన భార్య కోసం తాజ్ మహల్ నిర్మించడానికి ఎంత ఖర్చయిందో.. ఇక తనకోసం నిర్మించుకున్న మయూరి సింహాసనం కోసం కూడా అంతే ఖర్చు పెట్టారు షాజహాన్. ఆ సింహాసనాన్ని దానిపై ఉంచిన కోహినూరు వజ్రాన్ని.. ఔరంగజేబు తీసుకెళ్లిపోయారు. ఇదంతా కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. మేమంతా కూడా ఢిల్లీలో జరగబోయే విషయాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమా చేసాము. రాబోయే పార్ట్ 2లో మీరు ఇవన్నీ చూడబోతున్నారు అంటూ సినిమాపై భారీ అంచనాల పెంచేశారు.
పవన్ కళ్యాణ్ ఎక్స్ట్రార్డినరీ స్టంట్స్ చేశారు..
ఇక నేను తీసిన 30 – 40 నిమిషాల షార్ట్ ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ ఎక్స్ట్రార్డినరీ స్టంట్స్ కూడా చేశారు.ఎర్రకోటకు ఎలా వెళ్లారు? వెళ్ళిన తరువాత కోహినూరు వజ్రాన్ని దొంగిలించడం, మయూరి సింహాసనం మీద నిల్చొని ఔరంగజేబుకి సవాలు విసరడం.. ఇలా అన్ని సన్నివేశాలు చిత్రీకరించాము. ముఖ్యంగా నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆ అభిమానంతోనే ఆ ఎర్రకోట సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది” అంటూ పార్ట్ 2 లో ఉండబోయే తన సీన్ గురించి వివరించారు క్రిష్ జాగర్లమూడి.
ALSO READ: Shraddha Das: తీన్మార్ స్టెప్పులతో పబ్లిక్ లో అదరగొట్టేసిన శ్రద్ధాదాస్.. వీడియో వైరల్!