Film industry:టాలీవుడ్ (Tollywood) సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ కి డీసీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా జూలై 24న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అధికారాన్ని పక్కనపెట్టి పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్స్ చేపట్టారు అని అటు అధికారాన్ని ఉపయోగించి టికెట్టు ధరలు పెంచుకున్నారని.. అధికారం దుర్వినియోగం చేశారు అంటూ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ (Vijay Kumar) హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు దీనిపై హైకోర్టు కీలక కామెంట్లు చేసింది..” ఈ మేరకు సీఎంతో సహా మంత్రులు సినిమాలలో నటించడంపై ఎలాంటి నిషేధం లేదు అని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో మాజీ సీఎం, సినీ నటుడు ఎన్టీఆర్ (NTR)విషయంలోనే అప్పట్లోనే హైకోర్టు తీర్పునిచ్చిందని”.. మరొకసారి గుర్తు చేసింది. పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగం చేశారు అంటూ వేసిన పిటిషన్ పై జస్టిస్ వెంకట జ్యోతి ఈ విధంగా తీర్పునిచ్చారు.. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ పై కేసు ఇప్పుడు ఆయనకు భారీ ఊరట కలిగించేలా కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్..
అసలేం జరిగింది అనే విషయానికి వస్తే.. మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి ఎస్ ఆర్ కె ఆర్ విజయ్ కుమార్.. పవన్ కళ్యాణ్ పై పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధులతో తన సినిమా హరిహర వీరమల్లు సినిమాను ప్రమోట్ చేసుకున్నాడని, ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ సినిమాను ప్రమోట్ చేసుకోవడం, కలెక్షన్లు, లాభాల కోసం సినిమా టికెట్ ధరలపై దృష్టి పెట్టడం సమంజసం కాదు అంటూ ఆయన ఆరోపణలు చేశారు. పైగా టికెట్ ధరలకు సంబంధించిన ఫైల్ ను తానే స్వయంగా ప్రాసెస్ చేసినట్లు పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పుకుంటున్నారని.. సొంత శాఖ కాకపోయినా ఎలా ప్రాసెస్ చేస్తారు? దీనిని అధికార దుర్వినియోగం కిందే పరిగణించాలి అంటూ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు.
అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటూ ఆరోపణలు..
అంతేకాదు ప్రభుత్వ వనరులను, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని ఏసీబీ, డీజీ, సీఎస్ కు లేఖ రాసినా వారు ఎవరు పట్టించుకోలేదని.. పవన్ కళ్యాణ్ మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసినా ఎవరు ముందుకు రాలేదని. అందుకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. దీనిపై సిబిఐ దర్యాప్తు చేయించాలని కూడా ఆయన కోరారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరగగా తదుపరి విచారణను ఈ నెల 15 కి వాయిదా వేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.