Kantara Chapter -1: కాంతార చాప్టర్ 1.. రిషబ్ శెట్టి (Rishabh Shetty) స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా గతంలో వచ్చిన ‘కాంతార’ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ అనూహ్య రెస్పాన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాంతార సినిమాలో ప్రస్తుతం ఏం జరిగింది అనే విషయాన్ని చూపించగా.. కాంతార చాప్టర్ వన్ మూవీలో కాంతార ప్రీక్వెల్ అంటూ రాజుల యుద్ధం, యువరాణితో ప్రేమ కథను చూపించబోతున్నారు.
విడుదల తేదీకి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు మేకర్స్. “బ్రహ్మకలశ” అంటూ సాగే ఆడియో సాంగ్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. అజనీష్ లోకనాథ్ స్వరాలు సమకూర్చారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా.. అబ్బి వి తన అద్భుతమైన గాత్రంతో ఆలపించారు. ఈ పాట ప్రేక్షకులలో భక్తి పారవశ్యాన్ని పెంచేసింది. ముఖ్యంగా “వరాహరూపం” థీమ్ తో మొదలైన ఈ మ్యూజిక్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా అటు కథతోనూ ఇటు పాటలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధం అయిపోయారు రిషబ్ శెట్టి.
రికార్డులు సృష్టించిన కాంతార..
కాంతార సినిమా విషయానికి వస్తే.. 2022లో కన్నడలో హోమ్ భలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మించిన చిత్రం కాంతార. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడమే కాకుండా ఇందులో లీడ్రోల్ పోషించారు. తెలుగులో గీతా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేసింది. సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్, కిషోర్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా 2022 సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై తెలుగులో అక్టోబర్ 15న విడుదలయ్యింది. తర్వాత పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమాలో ఉత్తమ నటన కనబరిచినందుకు రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు కూడా లభించింది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించింది.
మానవాతీత శక్తులు కలిగిన పాత్రలో రిషబ్ శెట్టి..
ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ వన్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో చాలామంది నటీనటులను రిపీట్ చేసినా.. హీరోయిన్ ను మాత్రం మార్చేశారు. అలా ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. 2023 నవంబర్లో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. అక్టోబర్ రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో మానవాతీత శక్తులు కలిగిన నాగసాధు పాత్రలో రిషబ్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు..
ALSO READ:Bigg Boss 9 Promo: దసరా జాతర.. సందడి చేసిన మూవీ యూనిట్స్!
రిషబ్ శెట్టి తదుపరి చిత్రాలు..
ప్రస్తుతం రిషబ్ శెట్టి ఈ సినిమా తరువాత హనుమాన్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రాబోతున్న జై హనుమాన్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఛత్రపతి శివాజీ చిత్రంలో కూడా ఆయన అవకాశం అందుకున్నట్లు సమాచారం.