Vijay Thalapathi:తమిళనాడులోని కరూర్ లో టీవీకే అధినేత విజయ్ దళపతి (Vijay Thalapathi) నిర్వహించిన ర్యాలీలో తీవ్ర తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో ఏకంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 10మంది చిన్నారులు, 18 మంది మహిళలు ప్రాణాలు కోల్పోవడం అందరిని కలచి వేస్తోంది. మరో 50 మందికి పైగా గాయపడగా అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే విజయ్ ప్రసంగాన్ని నేరుగా చూడాలి అని పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అయితే ఆయన ప్రసంగిస్తున్నప్పుడు జనాలను కంట్రోల్ చేయలేక పోలీసులు ఇబ్బంది పడ్డారు. దాంతో తొక్కిసలాట జరగగా చాలామంది స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి.. కొంతమందికి స్వయంగా ఆయనే వాటర్ బాటిల్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు.
అయితే పరిస్థితి చేజారిపోవడంతో చాలామంది ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కానీ కొంతమందిని అతి కష్టం మీద అక్కడికి చేరుకున్న అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. ఇకపోతే ప్రస్తుతం కొంతమంది హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ ఘటనపై టీవీకే అధినేత ప్రముఖ హీరో విజయ్ దళపతి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు.
ఈ ఘటనతో మనసు ముక్కలైంది – విజయ్
కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ ట్వీట్ చేస్తూ.. “ఈ తొక్కిసలాట ఘటనతో నా హృదయం ముక్కలైంది. దుఃఖం, బాధలో మునిగిపోయాను. ఈ బాధ వర్ణనాతీతం. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ విజయ్ ప్రకటించారు.
also read:Bigg Boss 9: సంజన గల్రానీకు సుప్రీం కోర్ట్ నోటీసులు.. దిక్కుతోచని స్థితిలో కంటెస్టెంట్!
విజయ్ ను అరెస్టు చేయాలంటూ డిమాండ్..
ఇకపోతే ఈ ఘటన జరగడంతో హీరో విజయ్ ఇంటి దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా డిఎంకె, ఏఐడీఎంకే కాంగ్రెస్ నేతలు విజయ్ ను అరెస్టు చేయాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమంటూ టీవీకే నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
విజయ్ అరెస్ట్ పై సీఎం స్టాలిన్ ఏమన్నారంటే?
మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా స్పందించారు.. తొక్కిసలాట తర్వాత హుటాహుటిన నిన్న రాత్రి కరూర్ కి చేరుకున్న ఆయన ప్రమాదంపై అధికారులను ఆరా తీశారు. హాస్పిటల్లో బాధితులతో మాట్లాడిన ఆయన.. మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులకు సూచించారు. అదే సమయంలో ఆయన మాట్లాడుతూ..” ఈ సందర్భంగా రాజకీయ విమర్శలు నేను చేయదలచుకోలేదు. బాధితులకు సహాయం అందించడమే నా ముందున్న తక్షణ కర్తవ్యం. ఘటనపై విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేశాము. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ఈ ఘటనపై విజయ్ ను అరెస్టు చేస్తారా? లేదా? అనే విషయంపై కూడా ఇప్పుడు నేను మాట్లాడను అంటూ స్టాలిన్ స్పష్టం చేశారు.
స్పందించిన పలువురు రాజకీయ ప్రముఖులు..
ఈ ఘటనపై దేశ ప్రధానమంత్రి మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
இதயம் நொறுங்கிப் போய் இருக்கிறேன்; தாங்க முடியாத, வார்த்தைகளால் சொல்ல முடியாத வேதனையிலும் துயரத்திலும் உழன்று கொண்டிருக்கிறேன்.
கரூரில் உயிரிழந்த எனதருமை சகோதர சகோதரிகளின் குடும்பங்களுக்கு என் ஆழ்ந்த அனுதாபங்களையும், இரங்கலையும் தெரிவித்துக்கொள்கிறேன். மருத்துவமனையில் சிகிச்சை…
— TVK Vijay (@TVKVijayHQ) September 27, 2025