రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళ శబరిమలలోని అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పండితులు, అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. రాష్ట్రపతి భక్తిశ్రద్ధలతో 18 మెట్ల మీదుగా ఇరుముడి మోసుకెళ్లి స్వామివారికి సమర్పించారు. అయ్యప్పను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పండితులు ఆమెకు వేద ఆశీర్వచనాలు ఇచ్చి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శబరిమలకు వెళ్లిన తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక సాంప్రదాయ ఆచారాలను అనుసరించి ప్రెసిడెంట్ ముర్ము ఉదయం 11 గంటల ప్రాంతంలో పంబ బేస్ క్యాంప్ కు చేరుకున్నారు. పంపా నదిలో పాదాలను కడుక్కుని.. సమీపంలోని గణపతి ఆలయంలో పూజలు చేశారు. నల్ల చీర ధరించి, ‘కెట్టునిర’ వేడుకలో పాల్గొన్నారు, అక్కడ మేల్శాంతి (ప్రధాన పూజారి) తన ‘ఇరుముడికెట్టు’ను సిద్ధం చేశారు. ఆమె అల్లుడు గణేష్ చంద్ర హోంబరం, ఇతర సిబ్బంది కూడా ఇరుముడులు సిద్ధం చేసుకున్నారు. పంబా దగ్గర ఆచారాల తర్వాత, రాష్ట్రపతి బృందం. స్వామి అయ్యప్పన్ రోడ్డులో 4.5 కి.మీ మేర ప్రత్యేక ఫోర్ వీల్ డ్రైవ్ వాహనాలలో స్వామివారి సన్నిధానం చేరుకున్నారు.
సన్నిధానంలో రాష్ట్రపతి ముర్మును ఆలయ తంత్రి (ప్రధాన పూజారి), కందరారు మహేష్ మోహనరు సాంప్రదాయ ‘పూర్ణ కుంభ’ స్వాగతం పలికారు. ఆమెను రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి వి.ఎన్. వాసవన్ రాష్ట్రపతిని స్వాగతించారు. పవిత్రమైన ఇరుముడిని తల మీద మోసుకుంటూ, ఆమె 18 పవిత్ర మెట్ల మీదరుగా ప్రధాన గర్భగుడికి చేరుకున్నారు. అనంతరం ఆమె అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ‘ఇరుముడికెట్టు’ను ప్రధాన పూజారి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. ఆమె స్వామి వారిని మొక్కుకుని పక్కనే ఉన్న మలికప్పురం ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత, రాష్ట్రపతి భోజనం కోసం టిడిబి గెస్ట్ హౌస్ కు వెళ్లారు. ఆమె దర్శనం సమయంలో ఇతర భక్తులకు ప్రవేశం పరిమితం చేయబడిందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ప్రారంభమైన రాష్ట్రపతి ముర్ము నాలుగు రోజుల కేరళ అధికారిక పర్యటనలో శబరిమల సందర్శన కీలకమైనది.
President Droupadi Murmu performed Darshan and Puja at the Sabarimala Temple. She prayed before Lord Ayyappa for the well-being and prosperity of fellow citizens. pic.twitter.com/moJxzBS28h
— President of India (@rashtrapatibhvn) October 22, 2025
2018లో అయ్యప్ప స్వామివారి దర్శనం గురించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 10-50 ఏళ్ల వయసు ఉన్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై ఉన్న సాంప్రదాయ నిషేధాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి ముర్ము శబరిమల సందర్శనను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశంసించారు. “ఆమె వయసు 67. ఆమె ఏ నియమాలను ఉల్లంఘించలేదు. ఎవరి విశ్వాసాన్ని గాయపరచలేదు. అందరి మనోభావాలు గౌరవిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఇరుముడిని మోసుకెళ్లి అయ్యప్ప స్వామి ముందు నమస్కరించిన మొదటి రాష్ట్రపతిగా గుర్తింపు తెచ్చుకున్నారు” అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Read Also: రాష్ట్రపతి ముర్ము హెలికాప్టర్‌కు ప్రమాదం.. ల్యాండ్ అయిన వెంటనే….