Prashanth Varma: ప్రశాంత్ వర్మ (Prashanth Varma) .. ఒక్క సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు. 2018 ‘అ!’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కల్కి, జాంబిరెడ్డి చిత్రాలతో పరవాలేదు అనిపించుకున్న ఈయన.. గత ఏడాది ‘హనుమాన్’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగి పెద్ద సినిమాలను కూడా వెనక్కి నెట్టి.. గత ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా వెంకటేష్ (Venkatesh) నటించిన సైంధవ్, మహేష్ బాబు(Maheshbabu ) సర్కారు వారి పాట, నాగార్జున (Nagarjuna) నా సామిరంగా సినిమాలను కూడా వెనక్కి నెట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయం తర్వాత పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు కూడా ప్రశాంత్ వర్మతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చాయి. అలా వచ్చిన ప్రతి నిర్మాణ సంస్థను నిరాశపరచకుండా.. వచ్చిన ప్రతి అవకాశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు అడ్వాన్స్ రూపంలో కోట్ల రూపాయలు తీసుకున్నారట.
అలా ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేతిలో ఏకంగా 10 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ హీరోగా వస్తున్న అధీర చిత్రంతో పాటు ఆక్టోపస్, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మ రాక్షసుడు, సీతాకోకచిలుక ఇలా మొత్తం 10 చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద బడ్జెట్ తో బడా నిర్మాతలతో చేయాల్సిన సినిమాలే. వీటన్నింటికి ఆయా నిర్మాతల దగ్గర నుంచి అడ్వాన్స్ గా కథ కోసం మాత్రమే ఒక్కొక్క నిర్మాత నుంచి ఏకంగా రూ.2కోట్ల వరకు తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అలా అడ్వాన్స్ రూపంలో వచ్చిన డబ్బులు అన్నింటిని తీసుకెళ్లి ప్రశాంత్ వర్మ తన స్టూడియో కోసం ఖర్చుపెట్టినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా మరోవైపు డీవీవీ దానయ్య కుమారుడితో చేస్తున్న అధీరా సినిమా కోసం రూ.50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని.. ఇప్పుడు సినిమాలు స్టార్ట్ చేయమంటే తాను చేయను.. తన అసిస్టెంట్ డైరెక్టర్లతో చేయిస్తాను అంటూ ప్రశాంత్ వర్మ మాట మార్చినట్లు కూడా వార్తలు వినిపించాయి. దీనిపై డీవీవీ దానయ్య కూడా స్పందిస్తూ తాను ప్రశాంత్ వర్మ కు ఎటువంటి రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అని చెప్పి రూమర్స్ కి చెక్ పెట్టారు. కానీ మిగతా సినిమాల నిర్మాతలు తమను మోసం చేశాడు అని.. ప్రశాంత్ వర్మ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అడ్వాన్స్ తీసుకున్నప్పుడు ఈ మాట చెప్పలేదని.. కానీ ఇప్పుడు సినిమాలు చేయమంటే మాట మారుస్తున్నాడు అంటూ సదరు చిత్రాల నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రశాంత్ వర్మ మాత్రం కథ తనదే కానీ.. తన ఆధ్వర్యంలోనే తన అసిస్టెంట్ లతో సినిమాలు చేస్తాను అని చెబుతున్నాడు. అందుకే ఈ విషయంపై నిరాశ వ్యక్తం చేసిన నిర్మాతలు తమ డబ్బు తనకు ఇవ్వాలని , లేని పక్షంలో తానే స్వయంగా దర్శకత్వం వహించాలని.. లేకపోతే ఈ పంచాయతీని ఫిలిం ఛాంబర్ లోనే తేల్చుకుంటామని ప్రశాంత్ వర్మపై నిర్మాతలు కామెంట్లు చేశారు. అయితే మొన్నటి వరకు ప్రశాంత్ వర్మపై ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు కంప్లైంట్ చేస్తాము అని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి కానీ వారు ఎవరు ఫిలిం ఛాంబర్ కు వెళ్లలేదు.
అయితే ఇప్పుడు హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) తాజాగా ఫిలిం ఛాంబర్ లో ప్రశాంత్ వర్మపై కంప్లైంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిలిం ఛాంబర్ లో..” హనుమాన్ సినిమా తర్వాత తమకు అధీర , మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మ రాక్షస సినిమాలు చేస్తానని.. తమ వద్ద 10.3 కోట్లు అడ్వాన్స్ తీసుకొని సినిమాలు చేయడం లేదు.. పైగా 10.23 కోట్లు ఖర్చు పెట్టించి మరీ వేరే నిర్మాతల దగ్గర ఉన్న ఆక్టోపస్ సినిమాని కూడా మా చేత కొనిపించారు. అయితే ఆ సినిమా ఎన్వోసీ కూడా ఇప్పుడు ఇప్పించడం లేదు. ఈ ఐదు సినిమాల లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కింద ప్రశాంత్ వర్మ నుండి 100 కోట్లు నష్టపరిహారం కావాలి.. అలాగే అధీరా సినిమా దర్శకత్వం వహించడానికి కూడా అడ్వాన్స్ గా కోటి రూపాయలు ఇచ్చాను. అవన్నీ వెనక్కి ఇప్పించండి” అంటూ నిరంజన్ రెడ్డి ఫిలిం ఛాంబర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు . అంతే కాదు దీనిపై త్వరగా నిర్ణయం తీసుకొని తమకు రావాల్సిన డబ్బు చెల్లించేలా.. న్యాయం చేకూర్చాలి అని కూడా ఫిలిం ఛాంబర్ ను కోరారు.
ALSO READ:Chatrapathi Sekhar: అందుకే విడాకులు తీసుకున్నాం.. ఛత్రపతి శేఖర్ ఎమోషనల్ కామెంట్!
ఇక ఈ విషయంపై ప్రశాంత్ వర్మ స్పందించారు.. ఆయన మాట్లాడుతూ..” నేను ఈ సినిమాలు చేస్తానని ఎక్కడా చెప్పలేదు. కనీసం అగ్రిమెంట్లు కూడా లేవు. ఆక్టోపస్ విషయంలో ఏదైనా ఇష్యూ ఉంటే ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ తోనే తేల్చుకోవాలి. హనుమాన్ సినిమా ఏకంగా 295 కోట్లు కలెక్ట్ చేసింది. నాకు ఈ సినిమా లాభాల నుండి వాటా రావాలి కానీ సినిమా నుండి నాకు కేవలం 15.82 కోట్లు మాత్రమే లభించాయి. అది అడ్వాన్స్ కాదు హనుమాన్ చిత్రంలో నా షేర్. అయితే హనుమాన్ సినిమాలో నా వాటాను ఎగొట్టి ఆ డబ్బును డార్లింగ్, సంబరాల ఏటిగట్టు, బిల్లా రంగ భాష సినిమాలకు డైవర్ట్ చేశారు. పైగా అధీర సినిమా కోసం కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను అని అంటున్నారు. అయితే ఆ కోటి రూపాయలు సినిమా కోసం ఇవ్వలేదు. అధీర టీజర్ డైరెక్ట్ చేయడానికి ఇచ్చారు. అటు హనుమాన్ చిత్రం నుండి నాకు రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టడానికి ఈ కథ అల్లుతున్నారు” అంటూ ప్రశాంత్ వర్మ తెలిపారు. మరి ఫిలిం ఛాంబర్ కి ఎక్కిన ఈ పంచాయతీ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.